Anagani Satya Prasad: అయ్యప్ప దీక్ష స్వాముల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది: అనగాని సత్యప్రసాద్

Anagani Satyaprasad demands YCP Govt take measures for Ayyappa Swami devotees

  • రవాణా సౌకర్యం లేక భక్తులు ఇబ్బందిపడుతున్నారన్న అనగాని
  • భక్తుల మనోభావాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శలు
  • ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని వ్యాఖ్యలు

అయ్యప్ప దీక్ష స్వాముల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. దీక్షా విరమణ సమయంలోనూ ప్రత్యేక బస్సులు కేటాయించకపోవడంతో శబరిమల వెళ్లే స్వాములు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అయ్యప్పస్వామి దర్శన భాగ్యం లేక స్వాములు, భక్తులు నిరాశతో ఉంటున్నారని తెలిపారు. ప్రభుత్వం గానీ, దేవాదాయశాఖ మంత్రి గానీ కనీసం సమీక్షలు చేసే పరిస్థితి కూడా లేదని సత్యప్రసాద్ విమర్శించారు. భక్తుల మనోభావాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. 

"ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేక చర్యలు లేకపోవడంతో వేలాది మంది స్వాములు, భక్తులు దర్శనం కాకుండానే వెనుదిరిగి వస్తుండటం బాధాకరం. గతంలో... రద్దీ ఉన్న సమయంలో బస్సుల కేటాయింపుతో పాటు, సంబంధిత అధికారులతో చంద్రబాబు నాయుడు మాట్లాడి సమస్య పరిష్కరించేవారు. ఒక ప్రత్యేక అధికారిని నియమించి శబరిమల వెళ్లి వచ్చే భక్తులపై శ్రద్ధ చూపించారు. రాష్ట్రం నుండి ప్రత్యేక రైళ్లను కూడా ఆనాడు ఏర్పాటు చేశారు. 

కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పట్టించుకున్న పాపాన పోలేదు. వైసీపీ సభలకు ప్రత్యేక బస్సులు పెట్టి బలవంతంగా జనాన్ని తరలించడంపై ఉన్న శ్రద్ధ... అయ్యప్ప స్వాములకు ప్రత్యేక బస్సులు కేటాయించడంపై లేదు.  అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వ వ్యవహారశైలి ఉంటోంది. ఆయా రాష్ట్రాల భక్తులకు సంబంధించిన ఏర్పాట్లను వారి రాష్ట్రాలు చూసుకుంటున్నప్పుడు... ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి... అయ్యప్ప స్వాములు, శబరిమల వెళ్లే భక్తుల సమస్య పరిష్కారానికి ముందుకు రావాలి. 

రాష్ట్రం నుండి అనేక వ్యయప్రయాసలతో శబరిమల వెళ్లి దర్శన భాగ్యం లేక వెనుదిరిగి వస్తున్నా ప్రభుత్వంలో ఒక్క మంత్రి కూడా స్పందించకపోవడం దేనికి సంకేతం.? శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది గాయాలపాలైనా ప్రభుత్వం నుండి స్పందన లేదు. ఎలక్షన్... సెలక్షన్... కలెక్షన్ పై ఉన్న శ్రద్ధ.... ఈ ప్రభుత్వానికి అయ్యప్ప భక్తులపై లేదు. మకర సంక్రాంతి లోపైనా ప్రభుత్వం రవాణా సౌకర్యంపై చర్యలు తీసుకోవాలి. టీడీపీ అధికారంలోకి రాగానే శబరిమల వెళ్లే భక్తుల సమస్యలను పరిష్కరిస్తాం" అంటూ అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News