Hema Malini: అయోధ్యలో 'డ్రీమ్ గాళ్' నృత్య ప్రదర్శన
- అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం
- ఈ నెల 22న ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం
- జనవరి 17న నాట్య ప్రదర్శన ఇవ్వనున్న హేమమాలిని
ఎన్నో దశాబ్దాల న్యాయ పోరాటం ఫలించి, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అత్యున్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపడం, వేల కోట్ల రూపాయల వ్యయంతో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుపుకోవడం తెలిసిందే.
జనవరి 22న అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 6 వేలమంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో, అయోధ్యలో బాలీవుడ్ డ్రీమ్ గాళ్ హేమమాలిని నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. హేమమాలిని బీజేపీ నేత కూడా. ఆమె మధుర లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు.
కాగా, అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె రామాయణంలోని కొన్ని ఘట్టాలను నృత్యరూపకంగా ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని డ్రీమ్ గాళ్ హేమమాలిని స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. తొలిసారి అయోధ్య వస్తున్నానని, తన నృత్య కార్యక్రమం జనవరి 17న ఉంటుందని వెల్లడించారు.
అనేక హిట్ చిత్రాలతో అభిమానుల హృదయాల్లో స్వప్న సుందరి (డ్రీమ్ గాళ్)గా కొలువుదీరిన హేమమాలిని వయసు 75 ఏళ్లు. ఈ వయసులోనూ ఆమె ఎంతో ఉత్సాహంగా నాట్యప్రదర్శనలు ఇవ్వగలరు. భరతనాట్యంలో ఎంతో నైపుణ్యం కనబరిచే హేమమాలిని... తన ఇద్దరు కుమార్తెలు ఈషా డియోల్, అహనా డియోల్ లను కూడా మంచి నాట్య కళాకారిణులుగా తీర్చిదిద్దారు.