Lakshadweep Tourism: లక్షద్వీప్‌‌ ఐలాండ్స్‌లో భారీస్థాయి పర్యాటకం అసాధ్యం.. తేల్చి చెప్పిన స్థానిక ఎంపీ

Lakshadweep Can Never Handle A Major Tourist Influx MP Explains Why
  • లక్షద్వీప్ ఐల్యాండ్స్ ప్రకృతిపరంగా సున్నితమైనవన్న స్థానిక ఎంపీ ముహమ్మద్ ఫైజల్
  • కేవలం 150 హోటళ్లు మాత్రమే ఉన్నాయని వెల్లడి
  • ద్వీప నిర్వహణకు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు రూపొందించిందని వివరణ
  • ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే పర్యాటకులను అనుమతించే అవకాశం ఉందని స్పష్టీకరణ
భారత్-మాల్దీవుల దౌత్య వివాదం నేపథ్యంలో నెట్టింట ప్రస్తుతం ‘ఛలో లక్షద్వీప్’ నినాదం ట్రెండింగ్‌లో ఉంది. లక్షద్వీప్‌లో పర్యటించాలని అనేక మంది ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, ప్రకృతిపరంగా సున్నితమైన ఈ ద్వీప సముదాయం.. పర్యాటకులు భారీ స్థాయిలో తరలివస్తే తట్టుకోలేదని అక్కడి ఎంపీ ముహమ్మద్ ఫైజల్ తెలిపారు. ప్రస్తుతం అక్కడ నివాస సముదాయాలు, ప్రయాణ సదుపాయాలు కూడా పరిమితమేనని పేర్కొన్నారు. లక్షద్వీప్‌కు నేరుగా ఫ్లైట్ సర్వీసులు లేవని, కేవలం 150 హోటళ్లు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు. 

పగడపు దీవులైన లక్షద్వీప్ ఐల్యాండ్స్‌ను కాపాడుకునేందుకు సుప్రీం కోర్టు గతంలోనే సమగ్ర ద్వీప నిర్వహణ ప్రణాళికను రూపొందించిందని గుర్తు చేశారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అక్కడ మౌలిక సదుపాయాల కల్పన సుప్రీం ప్రణాళికకు అనుగుణంగానే ఉండాలని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి పరిమిత స్థాయిలో మాత్రమే పర్యాటకులను అనుమతించే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. ఆంక్షల మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ తగినంత రాబడి పొందాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉందని సూచించారు. 

లక్షద్వీప్ సముదాయంలోని 36 దీవుల్లో కేవలం పదింటిలోనే ప్రస్తుతం ప్రజలు నివసిస్తున్నారు. అక్కడి జనాభాలో గరిష్ఠంగా 10 శాతం మందే పర్యాటకంపై ఆధారపడ్డారు. అయితే, భారత్-మాల్దీవుల దౌత్య వివాదంతో ఈ ద్వీపం ఒక్కసారిగా ప్రజల దృష్టిలో పడింది. ఈ క్రమంలో లక్షద్వీప్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై కూడా చర్చ మొదలైంది.
Lakshadweep Tourism
Narendra Modi
Maldives
Diplomatic row

More Telugu News