Rohit Sharma: ఆఫ్ఘనిస్థాన్‌పై టీ20 సిరీస్ గెలుపుతో చరిత్ర సృష్టించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. కోహ్లీ రికార్డు బ్రేక్
- భారత్‌కు అత్యధిక టీ20 సిరీస్‌లు అందించిన కెప్టెన్‌గా నిలిచిన హిట్‌మ్యాన్
- ఆఫ్ఘనిస్థాన్‌పై సిరీస్ గెలుపుతో రోహిత్ సారధ్యంలో 12 సిరీస్‌లు గెలిచిన టీమిండియా
- విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టిన రోహిత్ శర్మ
ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో మరో మ్యాచ్ మిగిలివుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ టీమిండియా కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. భారత్‌ను అత్యధిక టీ20 సిరీస్‌లు గెలిపించిన కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది 12వ టీ20 సిరీస్ విజయంగా ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌పై గెలుపుతో 11 టీ20 సిరీస్ విజయాల కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలుకొట్టాడు. ఇక మాజీ దిగ్గజం ఎంఎస్ ధోని భారత కెప్టెన్‌గా 8 సిరీస్ విజయాలను అందించాడు. ఇక ఆఫ్ఘనిస్థాన్‌పై ఇండోర్ మ్యాచ్ గెలుపుతో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది 41వ విజయం కావడం గమనార్హం. మరో మ్యాచ్‌లో గెలిస్తే మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న 42 విజయాల రికార్డును సమం చేయనున్నాడు.
కాగా టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని దాదాపు 14 నెలల తర్వాత టీ20 జట్టులో రోహిత్ శర్మకు చోటివ్వగా.. ఆఫ్ఘనిస్థాన్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన చేశాడు. తొలి మ్యాచ్‌లో సున్నా పరుగులకే రనౌట్ అవ్వగా.. రెండవ మ్యాచ్‌లోనూ అదే రిపీట్ అయ్యింది. తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌కే రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా ఆదివారం రాత్రి ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, శివమ్ దూబే రాణించగా, బౌలింగ్‌లో అక్షర్ పటేల్ అదరగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన అక్షర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డ్ దక్కింది.