India Meteorological Department: 150వ వసంత వేడుకలు జరుపుకుంటున్న భారత వాతావరణ విభాగం
- 1875లో జనవరి 15న కోల్‌కతా వేదికగా ఆవిర్భవించిన సంస్థ
- ఏర్పాటైన నాటి నుంచి దేశ పురోగతిలో ఎనలేని సేవలు అందిస్తున్న ప్రభుత్వ సంస్థ
- 150 ఏళ్ల వేడుకల్లో భాగంగా ఏడాది పొడవునా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్న ఐఎండీ
వాతావరణం పరంగా దేశ వ్యవసాయ రంగానికి, ప్రకృతి విపత్తుల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగాలకు విశేష సేవలు అందిస్తున్న ‘భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నేడు (సోమవారం) 150వ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 1875లో జనవరి 15న కోల్‌కతా ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన నాటి నుంచి ప్రతి ఏడాది వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాలలో వేడుకలు జరుగుతున్నాయి. ఆవిర్భవించిన నాటి నుంచి ఐఎండీ దేశానికి నిరంతరాయంగా విశేషమైన సేవలు కొనసాగిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు, అధునాతన సాంకేతిక పురోగతి, ఇతర మార్పులతో దేశ పురోగతిలో తనవంతు సహకారాన్ని అందిస్తోంది.
ఐఎండీ ప్రస్తుతం దేశంలో అన్ని రంగాలకు అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు పారిశ్రామిక, వ్యాపార రంగాలకు కూడా అత్యంత కీలకమైనదిగా మారిపోయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా సేవల విస్తృతి పెరగడంతో ఐఎండీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏఐ టెక్నాలజీని వినియోగించి మరింత మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తోంది. 2025 జనవరి 15 నాటికల్లా ‘ప్రజా వాతావరణ సేవలు’ అందించడమే లక్ష్యంతో పనిచేస్తోంది. ప్రస్తుతానికి 34 క్రియాశీల రాడార్‌లను ఉపయోగించి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని విశ్లేషిస్తోంది.
ఇక చారిత్రాత్మకమైన 150 వసంతాల మైలురాయిని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏడాదంతా వేడుకలు నిర్వహించాలని భారత వాతావరణ విభాగం నిర్ణయించింది. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సెషన్లు నిర్వహించాలని ఐఎండీ నిర్ణయించింది. వాతావరణ శాస్త్రంలో ఉద్యోగ అవకాశాల వైపు విద్యార్థులను ప్రోత్సహించాలని నిశ్చయించింది. ఏడాది పొడవునా ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమాలు, ఉపన్యాసాలు నిర్వహించి విస్తృతమైన అవగాహన కల్పించనుంది.
ఇక చరిత్ర విషయానికి వస్తే బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కాలం 1875లో కోల్‌కతా కేంద్రంగా ఏర్పడింది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పర్యవేక్షణలో పనిచేస్తున్న ఐఎండీ ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ముంబయి, చెన్నై, న్యూఢిల్లీ, కోల్‌కతా, నాగ్‌పూర్, గౌహతి నగరాలలో సంస్థ ప్రధాన కార్యాలయాలు సేవలు అందిస్తున్నాయి. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో ఈ ఆరు ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వాతావరణ అంచనాలు, వ్యవసాయ సలహా సేవా కేంద్రాలు, తుపాను హెచ్చరిక కేంద్రాలతో అనేక విస్తృతమైన సేవలను సంస్థ అందిస్తోంది.