Artificial Intelligence: కృత్రిమ మేధతో ఉద్యోగాలు మాయం: ఐఎంఎఫ్ చీఫ్
- ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు పోతాయంటూ రిపోర్ట్
- రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదన్న ఐఎంఎఫ్ బాస్
- అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై ఏఐ ప్రభావం తక్కువేనని వ్యాఖ్య
కృత్రిమ మేధ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) తో ఉద్యోగాలపై ప్రభావం తప్పకుండా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజా నివేదికలో పేర్కొంది. ఉద్యోగాలపై పాజిటివ్ గానో లేదా నెగటివ్ గానో.. మొత్తానికి ఏదో ఒక రకంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావం తప్పకుండా ఉంటుందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జీవ చెప్పారు. కృత్రిమ మేధ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని అన్నారు.
ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు గల్లంతవుతాయని ఆమె అంచనా వేస్తున్నారు. అయితే, ఏఐతో సానుకూల ప్రభావాలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. ఉత్పాదకత, అభివృద్ధికి కృత్రిమ మేధ ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. కొన్ని ఉద్యోగాలు పోవచ్చు కానీ మిగతా ఉద్యోగాలను మరింత మెరుగు పరుస్తుందని, ఆదాయ స్థాయులను పెంచుతుందని క్రిస్టాలినా పేర్కొన్నారు.
ఇప్పుడిప్పుడే అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలపై కృత్రిమ మేధ ప్రభావం పెద్దగా ఉండదని క్రిస్టాలినా అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఏఐతో వీటికి పెద్దగా ప్రయోజనమూ సమకూరదని వివరించారు. పని ప్రదేశంలో కృత్రిమ మేధను ప్రవేశ పెట్టలేక పోవడం వల్ల ఉత్పాదకత సాధారణంగానే ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా వెనకబడిన దేశాలు, తక్కువ ఆదాయం కల దేశాలకు ఏఐ వల్ల ప్రయోజనం కలిగే అవకాశంలేదని చెప్పారు.
ఆ దేశాలకు కూడా ఏఐ ప్రయోజనాలు చేరేలా అభివృద్ధి చెందిన దేశాలు చేయందించాలని ఆమె సూచించారు. మొత్తంగా చూస్తే.. కృత్రిమ మేధతో కొంతమేర నష్టం ఉన్నప్పటికీ ప్రతీ ఒక్కరికీ ఊహకు కూడా అందనన్ని అవకాశాలను చేరువ చేస్తుందని క్రిస్టినా జార్జీవ అభిప్రాయపడ్డారు.