Gita Press: పుస్తకం ప్రచురణ డిమాండ్ తట్టుకోలేక.. ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోమంటున్న గీతాప్రెస్!
- ‘శ్రీరామ్‌చరిత్‌మానస్’ పుస్తకాలకు విపరీతమైన డిమాండ్
- 4 లక్షల పుస్తకాల డిమాండ్‌ను నెరవేర్చలేకపోయిన గీతాప్రెస్
- 15 రోజులపాటు పుస్తకాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించిన పబ్లిషింగ్ హౌస్
- ఒకేసారి లక్షమంది డౌన్లోడ్ చేసుకోవచ్చన్న గీతాప్రెస్
‘గాంధీ శాంతి బహుమతి’ ప్రకటించడంతో వెలుగులోకి వచ్చిన గోరఖ్‌పూర్‌లోని భారతీయ పుస్తక ప్రచురణ సంస్థ ‘గీతా ప్రెస్’ పేరు మరోమారు పతాక శీర్షికలకు ఎక్కింది. ఈ ప్రెస్ నుంచి వెలువడే ‘శ్రీరామ్‌చరిత్‌మానస్’ పుస్తకాలకు ఒక్కసారిగా విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో, ప్రచురణను తాత్కాలికంగా నిలిపెయాల్సివచ్చింది.
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఈ పుస్తకాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగి అన్నీ అమ్ముడుపోయాయి. ఆర్డర్లకు సరిపడా ప్రింట్లు వేసే పరిస్థితి లేకపోవడంతో వచ్చే 15 రోజులు తమ వెబ్సైట్ నుంచి శ్రీరామ్‌చరిత్‌మానస్ పుస్తకాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది.
ఒకేసారి లక్ష పుస్తకాలను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్టు పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ లాల్మణి త్రిపాఠి తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా అతి తక్కువ కాలంలో 4 లక్షల కాపీలను ప్రింట్ చేయలేకపోయినట్టు పేర్కొన్నారు. ప్రింటింగ్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తామని వివరించారు.