Ayodhya Temple: అయోధ్యలో పూజలందుకునే రాముడి విగ్రహం.. ఫొటో ఇదిగో!

Ram Lalla Idol Created By Arun Yogiraj To Be Installed In Ayodhya Temple
  • అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు ట్రస్టు ప్రకటన
  • అయోధ్యలో మీడియా సమావేశంలో వెల్లడించిన సెక్రటరీ చంపత్ రాయ్
  • ప్రాణ ప్రతిష్ఠ కోసం మూడు శిల్పాలను సిద్ధం చేసినట్లు వెల్లడి
  • నేటి నుంచి అయోధ్యలో ప్రారంభమైన ప్రాణ ప్రతిష్ఠ పూజలు
అయోధ్య రామమందిరంలో కొలువుతీరనున్న రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహంపై క్లారిటీ వచ్చింది. మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించనున్నట్లు టెంపుల్ ట్రస్ట్ ప్రకటించింది. ఈమేరకు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టెంపుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రాణప్రతిష్ఠ కోసం ముగ్గురు శిల్పులతో మూడు వేర్వేరు విగ్రహాలను సిద్ధం చేయించామని, అందులో అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని ఎంపిక చేశామని వివరించారు.

ఈ శిలా విగ్రహం 150 నుంచి 200 కిలోల బరువు ఉంటుందని చంపత్ రాయ్ తెలిపారు. సీతారాములు చెయ్యెత్తి ఆశీర్వదిస్తుండగా, పక్కనే లక్ష్మణుడు చేతులు కట్టుకుని నిలుచున్న భంగిమలో, రాముడి పాదాల చెంత కూర్చుని హనుమాన్ భక్తితో నమస్కరిస్తున్నట్లు అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. గర్భగుడిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని వివరించారు. అదే సమయంలో గడిచిన 70 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న బాల రాముడి (రామ్ లల్లా) విగ్రహాన్ని కూడా భక్తులు సందర్శించుకునేలా ఆలయంలో ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

అయోధ్యలో మొదలైన ప్రాణ ప్రతిష్ఠ పూజలు..
రామ మందిరం ప్రారంభోత్సవం, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన పూజలు మంగళవారం నుంచి మొదలయ్యాయని చంపత్ రాయ్ వివరించారు. ఈ రోజు (జనవరి 16) నుంచి 22 వ తేదీ వరకు రోజువారీ నిర్వహించే పూజల వివరాలను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఆలయంతో పాటు సరయూ తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఏరోజు ఏం జరుగుతుందంటే..
జనవరి 17: రామ్ లల్లా విగ్రహం ర్యాలీగా అయోధ్యకు చేరుకుంటుంది. సరయూ నది నీటితో నిండిన మంగళ కళశాన్ని భక్తులు ఆలయానికి చేరుస్తారు.
జనవరి 18: ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన పూజలకు శ్రీకారం చుడుతూ గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాత్రికా పూజ, బ్రాహ్మిణ్ వరణ్, వాస్తు పూజలు నిర్వహిస్తారు.
జనవరి 19: నవగ్రహ పూజ నిర్వహించి, హోమం ప్రారంభిస్తారు.
జనవరి 20: వాస్తు శాంతి తర్వాత సరయూ నది నీటితో ఆలయాన్ని శుద్ధి చేస్తారు.
జనవరి 21: రాముడి విగ్రహానికి జలాభిషేకం, గర్భగుడిలో ఏర్పాటు.
జనవరి 22: మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రాణప్రతిష్ఠ పూజ.
Ayodhya Temple
Ram Lalla Idol
Arun Yogiraj
Consecration ceremony
Ram mandir
Champat Rai
Ayodhya Temple Trust

More Telugu News