Revanth Reddy In Davos: తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యం.. వరుస భేటీలతో దావోస్‌లో రేవంత్ బిజీ
- తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం
- ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో ఒప్పందాలు
- రేపు కృత్రిమ మేధపై చర్చలో పాల్గొననున్న రేవంత్
- అప్‌డేట్స్ ఇస్తున్న తెలంగాణ సీఎంవో
దావోస్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు అధ్యక్షుడు బ్రెండి బోర్గ్, ఇథియోపియా డిప్యూటీ పీఎం మేకొనెన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, నైపుణ్య వృద్ధి వంటి అవకాశాలపై చర్చించారు.
ఒప్పందాలపై సంతకాలు
ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహారశుద్ధి, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లో అడుగుపెట్టిన సీఎం రేవంత్ బృందం పలుదేశాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో ఒప్పందాలు చేసుకోనుంది. అలాగే, నోవార్టిస్, ఆస్ట్రాజనిక్, గూగుల్, మెడ్‌ట్రానిక్స్, మాస్టర్‌కార్డ్, ఉబెర్, ఎల్డీసీ, బేయర్, యూపీఎల్ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ భేటీ అవుతారు. మన దేశానికే చెందిన టాటా, విప్రో, జేఎస్‌డబ్ల్యూ, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఎయిర్‌టెల్, గోద్రెజ్, బజాజ్, నాస్కాం, సీసీఐ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.
ఏఐతో హెల్త్ డేటాబేస్
కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించి వైద్యారోగ్య రంగంలో ప్రజల హెల్త్ డేటాబేస్‌ను రూపొందించే కీలక అంశంపై రేపు (బుధవారం) చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు యూరోపియన్ యూనియన్ కమిషన్ ఆరోగ్య ఆహార కమిషనర్, జెనీవా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సెంటర్ ఫర్ హెల్త్ అధినేత, ఆక్సియోస్ చీఫ్ ఎడిటర్, రువాండా ఐటీ మంత్రి, మయోక్లినిక్ సీఈవో, టుకడీ ఫార్మా కంపెనీ సీఈవో తదితరులు పాల్గొంటారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎం రేవంత్‌రెడ్డి అధికారిక ట్విట్టర్ ఖాతాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తున్నాయి. దావోస్ పర్యటనలో రేవంత్ వెంట ఐటీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, సీఈవో ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్‌రెడ్డి ఉన్నారు.