Golriz Ghahraman: దొంగతనానికి ప్రయత్నించి దొరికిపోయిన న్యూజిలాండ్ మహిళా ఎంపీ
- ఎంపీ పదవికి రాజీనామా చేసిన గొల్రి గెహ్రామన్
- గెహ్రామన్ గ్రీన్ పార్టీకి చెందిన ఎంపీ
- ఎంపీ చోరీలకు యత్నిస్తున్న వీడియోలు వైరల్
- తన మానసిక ఆరోగ్యం సరిగాలేదన్న ఎంపీ
న్యూజిలాండ్ లో ఓ మహిళా ఎంపీ షాపుల్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయింది. ఆమె పేరు గొల్రిజ్ గెహ్రామన్. గ్రీన్ పార్టీకి చెందిన ఈ ఎంపీ దొంగతనం ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే... ఆక్లాండ్, వెల్లింగ్టన్ నగరాల్లోని పలు వస్త్ర దుకాణాల్లో గెహ్రామన్ చోరీకి యత్నిస్తున్న కొన్ని వీడియో ఫుటేజిలు వైరల్ అయ్యాయి. దాంతో ఇతర పార్టీలు ఆమెపై ధ్వజమెత్తాయి. తనపై వస్తున్న ఆరోపణలకు గెహ్రామన్ బదులిచ్చారు.
తాను మానసిక వ్యాధితో బాధపడుతున్నానని, తన చర్యలకు కారణం అదేనని తనను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తనపై పని ఒత్తిడి విపరీతమైన ప్రభావం చూపిస్తోందని, ఆ ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని గెహ్రామన్ వివరించారు. కొన్నిసార్లు తన వాస్తవ మనస్తత్వానికి భిన్నంగా కొన్ని పనులు చేసేలా ఆ మానసిక ఒత్తిళ్లు దారితీస్తున్నాయని వెల్లడించారు.
అయితే ఆ పనులు ఏంటనేది తాను వివరించి చెప్పలేనని అన్నారు. ప్రజాప్రతినిధులుగా తాము అత్యున్నత స్థాయి ప్రమాణాలు నెలకొల్పాల్సి ఉన్నప్పటికీ, ఆ విధంగా చేయలేకపోయానని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని గెహ్రామన్ తెలిపారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని, ఇకపై తన మానసిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తానని వెల్లడించారున.