1265 kgs Laddoo: అయోధ్య రాముడికి సికింద్రాబాద్ నుంచి భారీ లడ్డూ
- 1,265 కిలోల లడ్డూను సిద్ధం చేసి పంపిన శ్రీరామ్ క్యాటరర్స్
- బుధవారం ఉదయం శోభాయాత్రగా బయలుదేరిన ప్రసాదం
- ఈ నెల 21 నాటికి రాముడి సన్నిధికి చేరుకుంటుందన్న క్యాటరర్స్ యజమాని
అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి మరో కానుక అందనుంది. ప్రాణప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని సిద్ధం చేసిన భారీ లడ్డూ అయోధ్యకు బయలుదేరింది. రాముడి గుడికి భూమి పూజ జరిగిన నాటి నుంచి ప్రాణప్రతిష్ఠ ముహుర్తం రోజు వరకు మొత్తం 1,265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా సికింద్రాబాద్ కు చెందిన శ్రీరామ్ క్యాటరర్స్ 1,265 కిలోల భారీ లడ్డూను తయారుచేశారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నుంచి ముందుగా అనుమతి పొంది, స్వామి వారికి నైవేద్యంగా సమర్పించేందుకు ఈ భారీ లడ్డూను సిద్ధం చేసినట్లు శ్రీరామ్ క్యాటరర్స్ యజమాని నాగభూషణం రెడ్డి తెలిపారు. ఈ భారీ లడ్డూతో పాటు మరో ఐదు చిన్న లడ్డూలను కూడా తయారు చేశామని వివరించారు. పికెట్ లోని ఆయన నివాసం నుంచి ఈ ప్రసాదాలను అయోధ్యకు చేర్చేందుకు బుధవారం ఉదయం శోభాయాత్రను ప్రారంభించారు. రోడ్డు మార్గం ద్వారా ఈ నెల 21 నాటికి ఇవి అయోధ్యకు చేరుకుంటాయని నాగభూషణం రెడ్డి పేర్కొన్నారు.
ఈ లడ్డూ తయారీకి 350 కిలోల శనగపిండి, 700 కిలోల చక్కెర, 40 కిలోల నెయ్యి, 40 కిలోల కాజు, 30 కిలోల కిస్మిస్, 15 కిలోల బాదం, 10 కిలోల పిస్తా, 32 గ్రాముల కుంకుమ పువ్వు వినియోగించినట్లు నాగభూషణం రెడ్డి వెల్లడించారు. ఈ లడ్డూను రాముడి గుడికి 50 మీటర్ల దూరంలో ప్రదర్శనకు ఉంచుతారని, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచుతారని ఆయన చెప్పారు.