Pakistan: ఇరాన్‌కు పాకిస్థాన్ సీరియస్ వార్నింగ్.. తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరిక

Pakistan Warns Iran To Face Serious consequences

  • బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్ అదిల్ ఉగ్రసంస్థ స్థావరాలను ధ్వంసం చేసిన ఇరాన్
  • ఇద్దరు చిన్నారులు మృతి చెందారని, మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారన్న పాక్
  • ఇది ‘రెచ్చగొట్టబడని ఉల్లంఘన’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పిన ఇస్లామాబాద్

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌ సరిహద్దుల వెంబడి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైష్ ఉల్-అదిల్ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ దాడిలో ఇద్దరు చిన్నారులు చనిపోయారని, మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారని చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకారం జైష్ ఉల్ అదిల్ గ్రూప్‌కు చెందిన రెండు కీలక బేస్‌లను ఇరాన్ ధ్వంసం చేసింది. వీటిలో కుహే సబ్జ్ ప్రాంతంలో ఉన్న బేస్ అతి పెద్దది. ఈ రెండింటినీ క్షిపణులు, డ్రోన్లతో ధ్వంసం చేసినట్టు ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. 

ఇరాన్ క్షిపణి దాడులను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది. తమ గగనతలంపై ఇది ‘రెచ్చగొట్టబడని ఉల్లంఘన’గా పేర్కొంది. ఈ దాడిలో అమాయకులైన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారని తెలిపింది. ఇది ‘పూర్తిగా ఆమోదయోగ్యం’ కానిదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్‌‌కు హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఘటన జరిగిన ప్రదేశం గురించి కానీ, గగనతల ఉల్లంఘన స్వభావం గురించి కానీ ఎక్కడా వెల్లడింలేదు. 

తమ భూభాగంపై ఇరాన్ దాడులను ‘చట్టవిరుద్ధమైన చర్య’గా పేర్కొంటూ టెహ్రాన్‌లోని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖలోని సీనియర్ అధికారి ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్టు పాకిస్థాన్ తెలిపింది. అంతేకాదు, ఈ ఘటనపై ఇరాన్ చార్జ్ డి'అఫైర్స్‌కు సమన్లు ఇచ్చింది. ఈ పరిణామాలకు ఇరాన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News