Raghu Rama Krishna Raju: టీడీపీ, జనసేన నేతలతో రఘురామకృష్ణరాజు ఆత్మీయ సమ్మేళనం.. షర్మిలపై ఆసక్తికర వ్యాఖ్యలు!
- భీమవరం మండలం రాయలం గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం
- పార్లమెంటు సమావేశాల తర్వాత నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని వెల్లడి
- టీడీపీ - జనసేన కూటమికి 135 నుంచి 155 వరకు సీట్లు వస్తాయని జోస్యం
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంక్రాంతి వేడుకల కోసం తన సొంత నియోజకవర్గానికి వెళ్లిన సంగతి తెలిసిందే. భీమవరం మండలం రాయలం గ్రామంలో టీడీపీ, జనసేన నేతలతో రఘురాజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్ల తర్వాత సొంత నియోజకవర్గంలో పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. పార్లమెంటు సమావేశాల అనంతరం తాను నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
వైసీపీ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని రఘురాజు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని... వైసీపీని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి 135 నుంచి 155 సీట్లను కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల ఎఫెక్ట్ వైసీపీపై ఉంటుందని... వైసీపీ ఓట్లు 5 నుంచి 7 శాతం వరకు చీలిపోతాయని అన్నారు. 17ఏ పై సుప్రీంకోర్టు తీర్పును సాక్షి పత్రికలో వక్రీకరిస్తూ రాశారని విమర్శించారు. కొత్త ప్రభుత్వంలోనే దీనిపై విచారణ జరుగుతుందని చెప్పారు.