Kesineni Chinni: టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుంది: కేశినేని చిన్ని
- దాదాపు 80 శాతం వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారన్న చిన్ని
- విజయవాడ పార్లమెంటు పరిధిలో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని కామెంట్
- షర్మిల ఎఫెక్ట్ తో వైసీపీ మూడో స్థానంలో నిలుస్తుందని వ్యాఖ్యలు
విజయవాడ ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరఫున బరిలో దిగేది కేశినేని చిన్ని (కేశినేని శివనాథ్) అని దాదాపుగా ఖరారైంది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని సోదరుడైన చిన్ని విజయవాడ లోక్ సభ స్థానంలో చురుగ్గా తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ గనుక చేరికల గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని అన్నారు. ఎవరో ఒకరిద్దరు తప్పితే దాదాపు 80 శాతం మంది వైసీపీ నేతలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ అవుతుందని ఓ నేత (కేశినేని నాని) అంటున్నారని, ఏ పార్టీ ఖాళీ అవుతుందో అటువంటి నాయకులకు త్వరలోనే చూపిస్తామని కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చిన్నాచితకా నేతలు... అందరూ టీడీపీ వైపు చూస్తున్నారని వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీదే విజయమని స్పష్టం చేశారు. రేపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు అందుకోబోతున్నారని, దాంతో వైసీపీ మూడో స్థానానికి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు.