addanki dayakar: పార్టీ నాకు మరింత మంచి స్థానం ఇవ్వాలనుకుంటోందేమో: అద్దంకి దయాకర్
- పార్టీ నిర్ణయం పట్ల అభిమానులు, కార్యకర్తలు ఇబ్బందపడి ఉంటారన్న దయాకర్
- నా మీద కుట్రనో... నాకు నష్టం జరుగుతుందనో భావించవద్దని సూచన
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది... నాకు పదవి ఇవ్వడం చాలా చిన్న విషయమని వ్యాఖ్య
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలుత తన పేరును ప్రకటించి... ఆ తర్వాత మహేశ్ కుమార్ గౌడ్ పేరును తెరపైకి తీసుకురావడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. పార్టీ తనకు మరింత మంచి స్థానం ఇవ్వాలని చూస్తోందేమోనని అభిప్రాయపడ్డారు. పార్టీ కోసం తాను సహనంగానే ఉంటానన్నారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.
"ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పార్టీ నిర్ణయం పట్ల నా అభిమానులు... పార్టీ అభిమానులు కాస్త ఇబ్బందిగా ఉండవచ్చు. కానీ పార్టీ కోసం మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కోసం ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎమ్మెల్సీ రాకపోయేసరికి అద్దంకి దయాకర్ మీద ఏదో కుట్రనో.. లేదా నష్టమో జరుగుతుందని భావించవద్దు. కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ తన పట్ల సానుకూలంగానే వున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చింది... దయాకర్‌కు అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం. కాబట్టి దీనిని పెద్ద అంశంగా చూడవద్దు. కాబట్టి పార్టీ భవిష్యత్తు కోసం ఆలోచించే వారిగా మనమంతా కలిసి ఉందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కేబినెట్‌కు సహకరిద్దాం" అన్నారు.