Arvind Kejriwal: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందలేదు.. 22 తర్వాత వెళతాను: కేజ్రీవాల్
- కుటుంబంతో కలిసి రాములవారిని దర్శించుకుంటానన్న కేజ్రీవాల్
- తన తల్లిదండ్రులు అయోధ్యకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని వెల్లడి
- అయోధ్యకు మరిన్ని రైళ్లు నడిపేందుకు ప్రయత్నిస్తామన్న ముఖ్యమంత్రి
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తనకు ఇప్పటి వరకైతే ఆహ్వానం అందలేదని... కానీ కుటుంబంతో కలిసి జనవరి 22వ తేదీ తర్వాత వెళ్లి రాములవారిని దర్శించుకుంటానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... తనకు ఓ లేఖను పంపించారని... దాని గురించి తాను అడిగితే అధికారికంగా ఆహ్వానించడానికి ఓ బృందం వస్తుందని చెప్పారని... కానీ ఇప్పటి వరకైతే ఎవరూ రాలేన్నారు. అయినా పర్వాలేదని వ్యాఖ్యానించారు. కానీ ఆ లేఖలో మాత్రం చాలామంది వీఐపీలు, వీవీఐపీలు వస్తున్నట్లు పేర్కొన్నారని తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఒక్కరిని మాత్రమే అనుమతిస్తున్నట్లు అందులో పేర్కొన్నారన్నారు.
తన తల్లిదండ్రులు కూడా అయోధ్యకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని కేజ్రీవాల్ తెలిపారు. అందుకే తన కుటుంబంతో కలిసి వెళ్తానన్నారు. తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి 22వ తేదీ తర్వాత అయోధ్యకు వెళ్తానన్నారు. కేజ్రీవాల్ ఇంకా మాట్లాడుతూ... 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ తర్వాత ఢిల్లీ నుంచి అయోధ్యకు మరిన్ని రైళ్లు నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.