NTR death anniversary: ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం.. ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అర్పించుదాం: చంద్రబాబు

Lets regain Ramannas kingdom of those days and pay real tribute to NTR says Chandrababu

  • నేడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా చంద్రబాబు స్పందన 
  • ఎన్టీఆర్ స్ఫూర్తిగా 'రా... కదలిరా!' కార్యక్రమానికి పిలుపు ఇచ్చానన్న టీడీపీ అధినేత
  • తిరిగి రామరాజ్య స్థాపనకు అందరం కదలాలని కోరిన చంద్రబాబు
  • ఒకే ఒక జీవితం.. రెండు తిరుగులేని చరిత్రలు సృష్టించారని ఎన్టీఆర్‌ను కొనియాడిన టీడీపీ చీఫ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు, సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. దేశంలో సంక్షేమపాలనకు ఆద్యుడైన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి నివాళులు అంటూ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. 

‘‘తెలుగు ప్రజలారా రండి. ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం. ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అర్పించుదాం’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘బలహీన వర్గాల అణచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికీ దక్కని భద్రతలతో తెలుగునేల అల్లాడుతున్న ఈ వేళ... తిరిగి రామరాజ్య స్థాపనకు ఎన్టీఆర్ స్ఫూర్తిగా మనందరం కదలాలి. అందుకే 'తెలుగుదేశం పిలుస్తోంది రా...  కదలిరా!' అని ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా నేను  'రా... కదలిరా!' అని పిలుపునిచ్చాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

‘‘ ఒకే ఒక జీవితం.. రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు. తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది...  తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలి’’ అని టీడీపీ అధినేత ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ ఫొటోని జోడించారు. కాగా నేడు (గురువారం) ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ శ్రేణులు నివాళులు అర్పించనున్నాయి.

  • Loading...

More Telugu News