Chandrababu: వాళ్లను పెంచి పోషించింది నేనే... గంజాయి మొక్కలని ఇప్పుడు తెలుసుకున్నా!: చంద్రబాబు
- గుడివాడలో 'రా కదలిరా' బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు
- జగన్ ప్రభుత్వం, వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో మండిపడిన చంద్రబాబు
- జగన్ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపణ
- వై కాన్ట్ (Why can't)) పులివెందుల నినాదంతో ముందుకెళదామని పిలుపు
టీడీపీ-జనసేన అన్‌స్టాపబుల్... ఎదురొస్తే తొక్కుకుంటూ పోవడమే అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుడివాడలో నిర్వహించిన 'రా కదలిరా' బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై, వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
జగన్ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని విమర్శించారు. ముఖ్యమంత్రి తన సొంత చెల్లితో పాటు పలువురిపై కేసులు పెట్టారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ అన్నారని... డీఎస్సీ అన్నారని... అవి ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందన్నారు. మహానుభావులు పుట్టిన గడ్డ కృష్ణా జిల్లా అన్నారు.
వై కాన్ట్ పులివెందుల?
జగన్ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. కానీ పది రూపాయలను వంద.. వందను వేయి... వేయిని పదివేలు చేసి సంపదను సృష్టించిన పార్టీ టీడీపీ అన్నారు. వారు 175 సీట్లు గెలుస్తామని చెబుతున్నారని... కానీ గెలవరన్నారు. మన నినాదం ఇప్పుడు 'వై కాన్ట్ (Why can't) పులివెందుల' అన్నారు.
అసలు వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి? అని చంద్రబాబు ప్రశ్నించారు. బాబాయ్‌ని చంపినందుకా? రాష్ట్రాన్ని నాశనం చేసినందుకా? ఎందుకు ఓటు వేయాలన్నారు. 83 రోజుల తర్వాత జగన్ పార్టీ ఇంటికే అని స్పష్టం చేశారు. అంగన్ వాడి టీచర్లు రోడ్డు మీద ఉంటే కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
నా వద్ద ఓనమాలు నేర్చుకొని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వచ్చారు!
టిడ్కో ఇళ్లను టీడీపీ కట్టిస్తే.. క్రెడిట్ వారు తీసుకుంటున్నారన్నారని మండిపడ్డారు. ఎవరికో పుట్టిన బిడ్డకు పేరు పెడితే సరిపోతుందా? అని చురక అంటించారు. టిడ్కో ఇళ్లు కట్టింది తామేనని, ఈ ఇళ్లను 90 శాతం తామే పూర్తి చేశామని... కానీ వారు కనీసం పది శాతం పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. అలాంటి వారు మూడు రాజధానులు కడతారా? అని ఎద్దేవా చేశారు. మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు తొందరలో భూస్థాపితం చేస్తారని వైసీపీని ఉద్దేశించి అన్నారు. వైసీపీ నేతల నోరు మురికి కాలువ అని... తన వద్ద ఓనమాలు నేర్చుకొని తనకే పాఠాలు చెప్పే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు మండిపడ్డారు.
నోరు పారేసుకుంటే భవిష్యత్తులో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక
మీకు నోరు ఉందని పారేసుకుంటే... భవిష్యత్తులో అందుకు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నానని కొడాలి నానికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. జనసేన, టీడీపీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నానని... అహంభావంతో విర్రవీగే వ్యక్తులను చిత్తుచిత్తుగా ఓడించడం మాత్రమే కాదని... కాలగర్భంలో కలిసేలా చేయాలని అన్నారు. తమ పోరాటం పవన్ కోసమో.. తన కోసమో కాదని... ప్రజాహితం కోసమే అన్నారు. భావితరాల కోసం.. రా కదలిరా అంటూ పిలుపునిచ్చారు. తన ఈ పిలుపు ప్రభంజనంగా మారాలని కోరుకుంటున్నానని అన్నారు.
బూతుల మంత్రి... నీతుల మంత్రి అంటూ చురకలు
ఇక్కడ (గుడివాడ) ఓ బూతుల మంత్రి (మాజీ) ఉంటే, బందర్లో నీతుల మంత్రి (మాజీ) ఉన్నాడని చురక అంటించారు. ఏమి కాంబినేషన్... బ్రహ్మాండమైన కాంబినేషన్ అని ఎద్దేవా చేశారు. పవన్‌ను తిట్టేందుకే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎక్కడ చూసినా భూకబ్జాలే అన్నారు. బందర్ పోర్టు ఎప్పుడో పూర్తి కావాల్సిందని.. కానీ వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. టీడీపీ ఉంటే ఇప్పటికే పూర్తి చేసేవాళ్లమన్నారు.
మరో పక్క జోగి ఉన్నాడని.. ఆయన నిన్నటి దాకా పెడనను పీడించిన రోగి అని దుయ్యబట్టారు. ఇప్పుడు ఈ చెత్తను పక్కన పడేశారని వ్యాఖ్యానించారు. తన ఇంటిపై దాడి చేస్తే అతనికి మంత్రి పదవి వచ్చిందన్నారు. ఇప్పుడు పెడనలో ఇతని సీటు చిరిగిపోయిందన్నారు.
మరో పక్క గన్నవరం.. ఆయన పేరు చెప్పడం కూడా తనకు ఇష్టం లేదని... తనది అతడి స్థాయి కాదన్నారు. వీళ్లను పెంచి పోషించింది తానేనని... వీరంతా గంజాయి మొక్కలని ఇప్పుడు తెలుసుకున్నానని వ్యాఖ్యానించారు. వీళ్ళు ఎంతగా తిడుతున్నా తనను నమ్ముకున్న 5 కోట్ల ప్రజల కోసం అన్నీ భరిస్తున్నానని తెలిపారు. వీరంతా తనకు లెక్క కాదన్నారు. పామర్రులో అనిల్ అభివృద్ధి సున్నా.. దోపిడీ మిన్న అని విమర్శించారు.
పేరు చెప్పను.. కానీ అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ ఓ ఎమ్మెల్యే అని విమర్శించారు. మురికి కాలువ మరమ్మతులలో కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక్కడి ఏడుగురు ఎమ్మెల్యేలను ఇంటికి పంపించాల్సి ఉందన్నారు. జనసేన, టీడీపీ రెండు పార్టీలు కలిసి మొత్తం మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపునివ్వడానికే మీ వద్దకు వచ్చానని ప్రజలను ఉద్దేశించి అన్నారు.
టీడీపీ-జనసేన గాలి వీస్తోంది
తనకు ఏమాత్రం అనుమానం లేదని... రాష్ట్రం మొత్తం టీడీపీ, జనసేన గాలి వీస్తోందన్నారు. ఈ గాలి సునామీలా మారి... ఆ సునామిలో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందన్నారు. వైసీపీ ఓటమి ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన తడాఖాను చూపిస్తామన్నారు.
అయితే ఈ రోజు నుంచి 83 రోజులు ప్రతి కార్యకర్త విశ్రమించకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. గెలుస్తామనే ధీమాతో లేదా ప్రజలు మనతోనే ఉన్నారనే ఆలోచన ఉంటే సరిపోదని... 83 రోజులు పని చేయాలన్నారు. ప్రతి ఒక్కరు సైకిల్ ఎక్కి టీడీపీ, జనసేన జెండాలు పట్టుకొని ఇల్లిల్లు తిరగాలని సూచించారు. ఆ తర్వాత కార్యకర్తలను గౌరవించే బాధ్యత మాది అన్నారు. 'గుడివాడ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలకు పిలుపునిస్తున్నానని... రా కదలిరా.. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం.. రాతి యుగం పోవాలి.. స్వర్ణ యుగం రావాలి.. రా కదలిరా' అని ముగించారు.