Janasena: విగ్రహాన్ని చూసి మోసపోవద్దు... జరిగిన దారుణాలను మర్చిపోవద్దు: జనసేన
- నేడు విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్
- దళితులపై దాడులను విగ్రహం వెనుక దాయాలని చూస్తున్నాడని జనసేన విమర్శ
- దళితులను హత్య చేసిన వారిని చేరదీస్తున్నాడని మండిపాటు
విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఈరోజు ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం, వైసీపీపై జనసేన పార్టీ విమర్శలు గుప్పించింది. ఐదేళ్ల జగన్ పాలనలో రికార్డు స్థాయిలో దళితులపై దాడులు జరిగాయని మండిపడింది. దళితులపై అధికార గణం జరిపిన దాడులని, వైసీపీ చేసిన మోసాలని అంబేద్కర్ మహనీయుడి విగ్రహం వెనుక దాచిపెట్టాలని జగన్ చూస్తున్నాడని విమర్శించింది.
నా ఎస్సీలు, నా ఎస్టీలు అని దీర్ఘాలు తీసే జగన్ కు దళితులపై తాను పలికే చిలక పలుకుల్లో పావు శాతమైనా ప్రేమ ఉంటే... దళితులపై ఇన్ని దారుణాలు జరిగేవా? అని ప్రశ్నించింది. అంబేద్కర్ మహనీయుడు కోరుకున్నది ఎన్నికల వరకు పథకాలు, ఎన్నికలప్పుడు విగ్రహాల ఏర్పాటా? అని అడిగింది. సమాజంలో దళితులపై వివక్ష పోవాలని అంబేద్కర్ అనుకున్నారని... కానీ, కంసమామ జగన్ దళితులని హత్యలు చేసిన వారిని చేరదీస్తున్నాడని దుయ్యబట్టింది. విగ్రహాన్ని చూసి మోసపోవద్దు... జరిగిన దారుణాలను మర్చిపోవద్దు అంటూ దళితులకు సూచించింది.