Jagan: జగన్‌ కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోంది?: సుప్రీంకోర్టు

Supreme Court asks CBI about delay of CBI inquiry in Jagan cases
  • జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణ రాజు పిటిషన్
  • విచారణ ఎంత త్వరగా ముగుస్తుందో చూద్దామన్న సుప్రీంకోర్టు
  • తదుపరి విచారణ ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని, కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేర్వేరు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. 

దీనికి తాము బాధ్యులం కాదని సీబీఐ తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. లోయర్ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని అన్నారు. దీంతో, మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ప్రశ్నించింది. సంబంధం దర్యాప్తు సంస్థకు కాకపోతే మరెవరికి ఉంటుందని అడిగింది. 

ప్రజాప్రతినిధులపై దాఖలైన పిటిషన్ లను వేగంగా విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసిందని... ఆ ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జగన్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. దీంతో, జగన్ కేసుల్లో విచారణ ఎంత త్వరగా ముగుస్తుందో చూద్దామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నామని తెలిపారు. 

మరోవైపు వైసీపీ పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా రఘురాజు వ్యవహరిస్తున్నారని... రాజకీయ కోణంలోనే ఆయన పిటిషన్లు వేశారని జగన్ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. అయితే, తాము ఈ పిటిషన్లను రాజకీయ కోణంలో పరిశీలించడం లేదని... న్యాయపరమైన అంశాలను మాత్రమే చూస్తున్నామని ధర్మాసనం తెలిపింది.
Jagan
YSRCP
Disproportionate Assets Case
Supreme Court
CBI

More Telugu News