Noida: ఎయిరిండియా ఉద్యోగిని కాల్చి చంపిన దుండగులు
- నోయిడాలోని సెక్టార్ 104లో దారుణ హత్య
- జిమ్ నుంచి బయటకు వచ్చిన సూరజ్ ను కాల్చి చంపిన దుండగులు
- మృతుడి కుటుంబానికి క్రిమినల్ హిస్టరీ
30 ఏళ్ల ఎయిరిండియా ఉద్యోగి సూరజ్ మాన్ ను దుండగులు కాల్చి చంపిన ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 104లోని మార్కెట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. నోయిడా డీసీపీ హరీశ్ చందర్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ఘటన సంభవించింది. జిమ్ నుంచి బయటకు వచ్చిన హరీశ్ తన కారులో కూర్చున్న సమయంలో ఆయనను కాల్చి చంపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
ఎయిరిండియాలో క్రూ మెంబర్ గా సూరజ్ పని చేస్తున్నాడు. నోయిడాలోని పాష్ లొకాలిటీలోని లోట్ పనాచీలో ఆయన నివసిస్తున్నాడు. సూరజ్ కుటుంబానికి క్రిమినల్ హిస్టరీ ఉంది. అయితే, ఈ నేరాల్లో సూరజ్ కు మాత్రం ఎలాంటి సంబంధం లేదు. గ్యాంగ్ గొడవల్లో భాగంగానే ఈ మర్డర్ జరిగింది. సూరజ్ సోదరుడు ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఒక జైల్లో ఉన్నాడు. కుటుంబంతో ఉన్న గొడవల కారణంగానే సూరజ్ ను దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.