CM Revanth Reddy: దావోస్‌లో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన.. ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే..!

The visit of CM Revanth Reddys team ended in Davos

  • తెలంగాణకు రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించిన సీఎంవో
  • మూడు రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసిందని ప్రకటన
  • 200లకుపైగా వ్యాపార సంస్థలు, ప్రతినిధులతో మాట్లాడారని తెలిపిన సీఎం కార్యాలయం

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం విజయవంతంగా పర్యటనను ముగించుకుంది. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు మూడు రోజుల్లో 200లకుపైగా ప్రముఖ వ్యాపార సంస్థలు, నాయకులను కలుసుకున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ప్రకటించింది. రూ.40,232 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అండగా నిలిచారని, ఆహార వ్యవస్థల విజన్‌లో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలని ప్రపంచ నాయకులను కోరారని తెలిపింది. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ ప్రపంచ వ్యాపార ఆమోదాన్ని పొందిందని సీఎంవో కార్యాలయం వ్యాఖ్యానించింది.

అదానీ, జేఎస్‌డబ్ల్యూ, టాటాటెక్, బీఎల్ ఆగ్రో, సర్గ్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరాజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్, క్యూసెంట్రియో, సిస్ట్రా, ఉబెర్ సహా పలు కంపెనీలతో చర్చలు సానుకూలంగా ముగిశాయని, ప్రత్యక్షంగా 2,500 కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం హబ్‌గా మార్చడంపై రేవంత్ ప్రసంగించారని సీఎం కార్యాలయం వెల్లడించింది.

ఇక దావోస్‌కు వెళ్లడం, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పెట్టుబడులు కీలకమని, పెట్టుబడుల కోసం నిరంతరం ప్రయత్నిస్తామన్నారు. ఈ వ్యాపారాలన్నింటినీ హైదరాబాద్‌, తెలంగాణకు స్వాగతిస్తున్నామని చెప్పారు. దావోస్ పర్యటన ముగింపు సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ విధంగా స్పందించారని ఎక్స్ వేదికగా సీఎంవో వెల్లడించింది.

  • Loading...

More Telugu News