Rahul Gandhi: రాహుల్ గాంధీకి జరిమానా విధించిన థానే కోర్టు

Thane court imposes fine to Rahul Gandhi

  • 2017లో జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య
  • హత్యతో ఆరెస్సెస్ కు లింక్ ఉందని రాహుల్ అన్నారని పరువునష్టం దావా
  • ఇంతవరకు కోర్టుకు స్టేట్మెంట్ ను సమర్పించని రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని థానే కోర్టు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే... 2017లో జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య జరిగింది. ఆమె హత్యతో ఆరెస్సెస్ కు సంబంధం ఉందని రాహుల్ అన్నారంటూ సంఘ్ కార్యకర్త వివేక్... రాహుల్ పై పరువునష్టం దావా వేశారు. అయితే, కోర్టుకు తన స్టేట్మెంట్ ను రాహుల్ ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో, 881 రోజుల ఆలస్యానికి గాను కోర్టు ఆయనకు రూ. 500 జరిమానా విధించింది. 

ఈ సందర్భంగా రాహుల్ తరపు న్యాయవాది నారాయణ్ అయ్యర్ కోర్టులో తన వాదనలు వినిపిస్తూ... తన క్లయింట్ ఢిల్లీలో ఉంటారని, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారని చెప్పారు. ఈ కారణంగానే స్టేట్మెంట్ ఇవ్వడంలో ఆలస్యమయిందని కోర్టుకు విన్నవించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు రాహుల్ కు రూ. 500 జరిమానా విధించింది. ఫిబ్రవరి 15న మరోసారి కేసును విచారిస్తామని తెలిపింది. ఈలోగా రాతపూర్వక స్టేట్మెంట్ ను ఇవ్వాలని ఆదేశించింది. 

సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పరువునష్టం అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తి ముందుగా కోర్టుకు తన స్టేట్మెంట్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సాక్షులను ప్రశ్నించడం, క్రాస్ క్వశ్చన్ చేయడం వంటివి ప్రారంభమవుతాయి.

  • Loading...

More Telugu News