Khalistan: కేజ్రీవాల్, భగవంత్ మాన్ లకు ఖలిస్థానీ లీడర్ హెచ్చరిక
- తన సహచరులను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్
- లేదంటే ఆప్ నేతలను రాజకీయంగా సమాధి చేస్తామని వార్నింగ్
- తమ మద్దతుతోనే పంజాబ్ లో ఆప్ గెలిచిందని వ్యాఖ్య
- కేజ్రీవాల్, మాన్ లకు 6 మిలియన్ డాలర్లు చందాగా ఇచ్చినట్లు వెల్లడి
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ని గెలిపించింది తామేనని ఖలిస్థానీ లీడర్, సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తెలిపాడు. తాము మద్దతుగా నిలవడం వల్లే భగవంత్ మాన్ ముఖ్యమంత్రి అయ్యారని, ఆ విషయం మరిచి ఇప్పుడు తన అనుచరులను అరెస్టు చేశారని ఆయన మండిపడ్డాడు. తన అనుచరులను వెంటనే విడుదల చేయకుంటే పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు భగవంత్ మాన్, అర్వింద్ కేజ్రీవాల్ లకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. ఈమేరకు గురుపత్వంత్ సింగ్ శనివారం ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశాడు.
శుక్రవారం పంజాబ్ లోని రాజ్ పురలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు.. ఖలిస్థానీ మద్దతుదారులు జగదీశ్ సింగ్, మన్ జీత్ సింగ్, దావిందర్ సింగ్ లను అరెస్టు చేశారు. ఈ అరెస్టుల విషయం తెలిసిన వెంటనే గురుపత్వంత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఫిబ్రవరి 15 లోగా తన అనుచరులను విడుదల చేయాలంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఆలోగా తన అనుచరులు జైలు నుంచి బయటకు రాకుంటే కేజ్రీవాల్, భగవంత్ మాన్ కు రాజకీయంగా సమాధి తప్పదని అందులో హెచ్చరించాడు.
ఇదే వీడియోలో వారిద్దరిపై గురుపత్వంత్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. పంజాబ్ లో ఖలిస్థానీ మద్దతుదారుల కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ హామీని నమ్మి అమెరికా, కెనదాలలోని ఖలిస్థాన్ వేర్పాటువాదులు చందాలు సేకరించి 6 మిలియన్ డాలర్లను ఆప్ నేతలకు అందజేశారని చెప్పారు. ఇప్పటికైనా వారు తమ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఖలిస్థాన్ వేర్పాటువాదుల చేతుల్లో హత్యకు గురైన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మార్గంలో నడవాలంటూ భగవంత్ మాన్ ను కేజ్రీవాల్ బలవంతపెడుతున్నారని గురుపత్వంత్ సింగ్ ఆరోపించారు.