Hyderabad District: హైదరాబాద్ నగరంలో 39 మంది పోకిరీల అరెస్ట్!
- రద్దీ ప్రాంతాల్లో వేధింపులకు పాల్పడుతున్న 39 మందిని అరెస్టు చేసిన పోలీసులు
- నిందితుల్లో 10 మందికి మూడు రోజుల జైలు శిక్ష, రూ.250 జరిమానా
- ముగ్గురిని హెచ్చరికలతో వదిలిపెట్టిన వైనం
- మిగతావారు మేజిస్ట్రేట్ ముందు హాజరుకావాల్సి ఉందన్న పోలీసులు
హైదరాబాద్ నగరంలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న పోకిరీలను పోలీసులు అరెస్టు చేశారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ నాంపల్లి, చార్మినార్, అప్జల్‌గంజ్ బస్టాప్, కైట్ ఫెస్టివల్ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్, పీపుల్స్ ప్లాజా సహా పలు రద్దీ ప్రాంతాల్లో అసభ్యకర చర్యలకు పాల్పడుతున్న 39 మందిని అరెస్టు చేశారు.
పట్టుబడ్డ నిందితుల్లో 10 మందికి మూడు రోజుల జైలు శిక్ష, రూ.250 జరిమానా విధించారు. ముగ్గురిని హెచ్చరించి వదిలేశారు. 26 కేసుల్లో నిందితులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది.
నగరంలో పోకిరీల ఆటకట్టించేందుకు షీటీమ్స్ మఫ్టీల్లో వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్న విషయం తెలిసిందే. మహిళల భద్రత కోసం రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో సంచరిస్తూ నిందితులను ఓకంట కనిపెడుతుంటారు. వేధింపులు జరిగిన సందర్భాల్లో వీడియో సాక్ష్యాలతో పోకిరీలను పట్టుకుని కేసులు నమోదు చేశారు. కాగా, ఈవ్ టీజింగ్ ఎదురైన సందర్భాల్లో తమను 9490616555 నెంబర్‌పై వాట్సాప్ ద్వారా సంప్రదించాలని పోలీసులు గతంలోనే పలుమార్లు వెల్లడించారు.