Ayodhya Ram Mandir: అయోధ్య వెళుతున్నారా... అయితే అక్కడి ఫేమస్ వంటకాల గురించి తెలుసుకోండి!

These are famous street foods in Ayodhya

  • ఈ నెల 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం
  • అయోధ్యలో ఆధ్యాత్మిక కోలాహలం
  • నోరూరించే రుచులకు అయోధ్య పెట్టింది పేరు

జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగనుండడంతో దేశంలోని అన్ని దారులు అయోధ్యకు దారితీస్తున్నాయి. దశాబ్దాల న్యాయపోరాటం అనంతరం రామ జన్మభూమిలో శ్రీరాముడు కొలువుదీరనున్న నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని గత కొన్నిరోజులుగా క్రతువులు జరుగుతుండడంతో, అయోధ్యలో సంపూర్ణ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ప్రత్యేక ఆహ్వానాలు అందుకున్న వివిధ రంగాల ప్రముఖులతో పాటు, రామ భక్తులు కూడా అయోధ్య పయనమవుతున్నారు. 

ఇక అసలు విషయానికొస్తే... అయోధ్య ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు, పసందైన వంటకాలకు కూడా పెట్టింది పేరు. ఇక్కడ లభించే చిరుతిళ్లు ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. దాల్ కచోరీ, చాట్, రబ్డీ, దహీ భల్లా వంటి వంటకాల పేరు చెబితే ఎవరైనా లొట్టలు వేయాల్సిందే. 

అయోధ్యలో అనేక రకాల స్వీట్లు నోరూరిస్తుంటాయి. వాటిలో రబ్డీ ఒకటి. దీన్ని అనేక రకాల డ్రైఫ్రూట్స్, కుంకుమపువ్వుతో కలిపి తయారుచేస్తారు. ఇది చాలా తక్కువ ధరకే లభ్యం కావడంతో విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఇది ప్రధానంగా ఉత్తరభారతదేశ సంప్రదాయ స్వీట్. చిక్కటి పాలు, చక్కెర, యాలకులు, డ్రైఫ్రూట్స్ తో తయారయ్యే రబ్డీని మాల్పువా, గులాబ్ జామూన్, జిలేబీ, పూరీలతో కలిపి తింటుంటే ఆ మజాయే వేరు అంటారు. 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వివిధ రకాల చాట్లకు ప్రసిద్ధి. ఇక్కడ ఒక్కోనగరంలో ఒక్కో తరహాలో చాట్లు తయారుచేస్తుంటారు. అయోధ్యలో దొరికే చాట్ ను రుచిచూస్తే వావ్ అంటారు. ఇది మిగతా చాట్లకు కాస్త భిన్నంగా ఉంటుంది. అయోధ్య చాట్ ను తీపి, పులుపు, చిక్ పీస్, పరిమళభరితమైన కొత్తిమీర, ఇతర మసాలా దినుసులు కలిపి తయారు చేస్తారు. సాయంత్రం వేళలో అయోధ్య నగరంలోని చాట్ బండ్ల వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది.
ఇక దాల్ కచోరీ విషయానికొస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో దీన్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటారు. దాల్ కచోరీ తయారీలో మినపపప్పు, పెసరపప్పు, కూరగాయలు వినియోగిస్తారు. ఇవి చూడ్డానికి కొంచెం పూరీల్లా అనిపిస్తాయి. వీటిని చట్నీలతో కలిపి తింటారు. ఇది ఎంతో ఆరోగ్యకరమైన వంటకం. పోషకాలు దీంట్లో మెండుగా ఉంటాయి. 
అయోధ్య వెళ్లిన వారికి ఎక్కడ చూసినా కనిపించే వంటకం దహీ భల్లా. వివిధ రకాల పప్పులతో చేసిన వడలను పెరుగులో నానవేసి ఇస్తారు. దీంట్లోకి తీపి-పులుపు చట్నీలు అదిరిపోయే కాంబినేషన్ అని చెప్పాలి. దక్షిణాది పెరుగు వడ వంటకాన్ని పోలినదే అయినప్పటికీ, దీంట్లో బంగాళాదుంప ముక్కలు, అప్పడాల ముక్కలు కూడా కలుపుతారు. ఈ వంటకంలో ఎక్కడా ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించరు.

  • Loading...

More Telugu News