Dasoju Sravan: రేవంత్ రెడ్డి లండన్ వెళ్లి సీఎం పదవి విలువ తీస్తున్నారు: దాసోజు శ్రవణ్
- అబద్ధాల పునాదులపై రాజకీయం చేస్తారని... అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడుతారని విమర్శ
- కుక్క తోకకు గుండు కట్టినా చక్కగా రాదన్నట్లుగా అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని వ్యాఖ్య
- దావోస్‌లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించిన దాసోజు శ్రవణ్
అబద్ధానికి.. అహంకారానికి నిలువెత్తు రూపం రేవంత్ రెడ్డి... అలాంటి వ్యక్తి లండన్ వెళ్లి సీఎం పదవి విలువ తీస్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ శనివారం మండిపడ్డారు. ఆయన బీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ... ఎలుక తోక ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్లుగా అబద్ధాల పునాదులపై రాజకీయం చేసే రేవంత్ రెడ్డి... అహంకారాన్ని ఆభరణంగా మార్చుకొని ఇష్టారీతిన పరుషపదజాలంతో రాజకీయాల్లో చెలామణి అయిన రేవంత్ రెడ్డి... ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాతైనా అబద్ధాలు, అహంకారం మానుకొని హుందాగా నడుచుకుంటారని... సీఎం కుర్చీకి వన్నె తెస్తాడని ఆశపడ్డామని.. కానీ అందుకు భిన్నంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఆఖరుకు అంతర్జాతీయ వేదిక దావోస్‌లోనూ రాజకీయం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఆయన తీరును ప్రజలంతా అర్థం చేసుకోవాలన్నారు. కుక్క తోకకు గుండు కట్టినా చక్కగా రాదన్నట్లుగా... అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అవే అబద్ధాలను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. గతంలో వచ్చిన కంపెనీలను రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ తీసుకువచ్చినట్లుగా చెప్పుకుంటున్నారన్నారు. ఇది మోసపూరిత చర్య అన్నారు. పెట్టుబడుల విషయంలోనూ అబద్ధాలు మాట్లాడితే ఎలా? రాజకీయాల్లో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు సరే.. కానీ దావోస్ విషయంలోనూ అబద్ధాలా? అని ప్రశ్నించారు. అబద్దానికి.. అహంకారానికి నిలువెత్తు రూపంగా ఉన్న రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని సూచించారు.
దావోస్‌లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
రేవంత్ రెడ్డి విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి దుర్మార్గమైన మాటలు మాట్లాడారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఐటీ ఎగుమతులను రూ.57 వేల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు తీసుకు వెళ్లామన్నారు. ఐటీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. లోక్ సభలో అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు చేస్తే... అదే అదానీతో రేవంత్ రెడ్డి ఎంవోయూలు కుదుర్చుకున్నారన్నారు. అదానీతో ఢిల్లీలో కాంగ్రెస్ కుస్తీ... తెలంగాణలో దోస్తీ అన్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణను అదానీకి తాకట్టు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసిన తర్వాతే అదానీతో ఒప్పందాలు జరుగుతున్నట్లు ఆరోపించారు. మోదీ తొత్తుగా పనిచేస్తున్న అదానీతో రేవంత్ దోస్తీ ఏమిటి? అన్నారు. రక్షణ రంగంలో అదానీకి అనుభవంలేదని రాహుల్ గాంధీ చెబితే... తెలంగాణలో ఆయన డిఫెన్స్ పరిశ్రమలకు రేవంత్ అనుమతులు ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. దొంగలు దొంగలు దేశాలు పంచుకున్నట్లుగా అదానీ, రేవంత్ దోస్తీ ఉందన్నారు. అదానీ ప్రతిపాదనలను కేసీఆర్ తిరస్కరించారని గుర్తు చేశారు.