Mohan Babu: అయోధ్య ఆహ్వానం అందింది.. కానీ వెళ్లలేకపోతున్నా: మోహన్ బాబు
- భద్రతా కారణాల వల్ల అయోధ్యకు వెళ్లలేకపోతున్నానన్న మోహన్ బాబు
- క్షమించమని లేఖ రాశానని వెల్లడి
- మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని వ్యాఖ్య
కోట్లాది మంది హిందువులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఎల్లుండి జరగబోతోంది. ఈ కార్యక్రమం కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వెళ్తున్నారు. దాదాపు 8 వేల మంది ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నుంచి ఆహ్వానాలు అందాయి. పలువురు టాలీవుడ్ ప్రముఖులను కూడా ట్రస్టు ఆహ్వానించింది. ప్రముఖ నటుడు మోహన్ బాబుకు కూడా ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
అయోధ్య వేడుకకు తనకు కూడా ఆహ్వానం అందిందని మోహన్ బాబు చెప్పారు. అయితే, భద్రతా కారణాల వల్ల రాలేకపోతున్నానని, తనను క్షమించమని లేఖ రాశానని తెలిపారు. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.
ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానం పాలక మండలి ఛైర్మన్ గా తాను బాధ్యతలను స్వీకరించానని మోహన్ బాబు తెలిపారు. ఈ దేవాలయంలో వెంకటేశ్వరస్వామి, శ్రీరాముడు, షిర్డీ సాయిబాబా, లక్ష్మీనరసింహ స్వామి, సంతోషిమాత ఇలా 18 మంది దేవతామూర్తులు కొలువై ఉన్నారని చెప్పారు. రామ మందిర ప్రారంభోత్సవం నాడు ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.