Chandrababu: అంబేద్కర్ కు 'భారతరత్న' వచ్చింది నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ ఉన్నప్పుడే: చంద్రబాబు
- కోనసీమ జిల్లా మండపేటలో రా కదలిరా సభ
- ఈ ముఖ్యమంత్రి దళిత ద్రోహి అంటూ బాబు విమర్శలు
- దళితులను పథకం ప్రకారం నాశనం చేశాడని వ్యాఖ్యలు
కోనసీమ జిల్లా మండపేటలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. దళితులకు తానేదో చేశానని సీఎం గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు.
"అప్పట్లో అంటరానితనం ఉండేది, రెండు గ్లాసుల విధానం ఉండేది. దీనిపై అధ్యయనం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాం. దళితుల వెతలపై ఆయన ఓ నివేదిక ఇచ్చారు. ఎంతో అధ్యయనం చేసి 12 జీవోలు తీసుకువచ్చి, దళితుల అభ్యున్నతికి చర్యలు తీసుకున్నాం.
అంతేకాదు, మహనీయుడు అంబేద్కర్ కు భారతరత్న వచ్చింది ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడేనని గుర్తించాలి. ఈ ప్రాంతానికి చెందిన జీఎంసీ బాలయోగిని లోక్ సభ స్పీకర్ గా నామినేట్ చేసింది టీడీపీనే. ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా నామినేట్ చేశాం. దళిత వర్గానికి చెందిన కాకి మాధవరావును సీఎస్ గా నియమించాం. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీగా మరో ఎస్సీ వ్యక్తి వచ్చిన దాఖలాలు లేవు. కేఆర్ నారాయణన్ ను రాష్ట్రపతిగా ప్రతిపాదించింది మేమే. దళితులను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ది చేసేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నాం.
కానీ ఈ ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకి. దళితుల కోసం మేం తీసుకువచ్చిన 27 పథకాలను రద్దు చేశాడు. సబ్ ప్లాన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. దళితుల కోసం ఖర్చు చేయాల్సిన రూ.28 వేల కోట్లను ఎక్కడికక్కడ దారి మళ్లించాడు. ఇతని అహంకారం ఎక్కడివరకు వెళ్లిందంటే... అంబేద్కర్ విదేశీ విద్య పథకం పేరును మార్చివేసి జగన్ విదేశీ విద్య అని పెట్టుకున్నాడు. దళిత ద్రోహి ఈ జగన్ మోహన్ రెడ్డి.
ఈయనొక పెద్ద పెత్తందారు. ఎవరూ మాట్లాడ్డానికి వీల్లేదు. దళితులు నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలబడకూడదు. ఎవరైనా నోరు విప్పితే వారిపై దాడులు, గొంతు నొక్కే పరిస్థితికి వచ్చారు. నాలుగున్నరేళ్లలో దళితులపై 6 వేలకు పైగా దాడులు జరిగాయి. 188 మంది దళితులు హత్యకు గురయ్యారు" అంటూ చంద్రబాబు వివరించారు.
కోడికత్తి డ్రామా ఆడి గత ఎన్నికల్లో సానుభూతి తెచ్చుకుని, కోడికత్తి శ్రీనివాస్ ను జైలుకు పంపారని విమర్శించారు. పెద్ద తప్పు చేయనివాడు జైల్లో ఉన్నాడు... బాబాయ్ ని చంపినవాడు మాత్రం బయట తిరుగుతూ, ఊరేగింపులు చేసుకుంటున్నాడని మండిపడ్డారు.
"ఈ రెండు విషయాల్లోనూ సింపతీ సంపాదించుకున్నాడు, సానుభూతితో ఓట్లు వేయించుకున్నాడు. కానీ ఈరోజు... అక్కడ హత్య చేసిన వాడ్ని కాపాడతాడు, నేరం చేయని వ్యక్తిని ఐదు సంవత్సరాలుగా జైల్లో పెట్టాడు. ఈ జిల్లాలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉదంతం కూడా మీకు తెలుసు. చంపిన ఎమ్మెల్సీకి ఊరేగింపులు నిర్వహిస్తారు. దళితుడ్ని చంపి డోర్ డెలివరీ పంపించాడు. దీనిపై ఇంతవరకు చర్యలు లేవు.
మా అక్కకు అన్యాయం చేయొద్దండీ, వేధించొద్దండీ అని ఓ బీసీ కుర్రాడు (అమర్నాథ్) అడిగితే అతడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. అమరావతిలో దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దళితులను ఇంత నిర్వీర్యం చేసి, దళితులను పథకం ప్రకారం నాశనం చేసిన వ్యక్తి... ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెట్టి దళితులను ఉద్ధరిస్తాను, సామాజిక న్యాయం చేస్తాను అంటే ఎవరైనా నమ్ముతారా?" అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.