CM Revanth Reddy: హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
- వారం రోజుల పాటు కొనసాగిన విదేశీ పర్యటన
- దావోస్ లో సమిట్ కు హాజరైన సీఎం రేవంత్
- ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారులతో కలిసి టూర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. వారం రోజుల విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం ఉదయం శంషాబాద్ లో ల్యాండయ్యారు. ఈ నెల 15న మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ సహా ఉన్నతాధికారుల బృందం సీఎం రేవంత్ తో పాటు ఈ సదస్సులో పాల్గొంది.
ఈ పర్యటనలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు పేరొందిన పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వారితో చర్చలు జరిపారు. మొత్తంగా ఈ టూర్ లో రాష్ట్రానికి 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈమేరకు ఆయా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. దావోస్ లో సదస్సు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 18న లండన్ చేరుకున్నారు.
అక్కడి థేమ్స్ నది నిర్మాణాన్ని పరిశీలించడంతో పాటు స్థానిక అధికారులతో మాట్లాడారు. లండన్ లోనూ పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం లండన్ టూర్ కు హైదరాబాద్ నుంచి ఐఏఎస్ అధికారులు దానకిశోర్, ఆమ్రపాలి తదితరులు వెళ్లారు. లండన్ నుంచి సీఎం బృందం దుబాయ్ లో పర్యటించింది. సోమవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు తిరిగొచ్చారు.