Ram Mandir: రాముడి గుడి కోసం 14 ఏళ్ల బాలిక రూ.52 లక్షల విరాళం
- అయోధ్య రామ మందిర నిర్మాణంలో సూరత్ బాలిక
- రామాయణ పారాయణంతో విరాళాల సేకరణ
- మూడేళ్లలో 50 వేల కి.మీ. ప్రయాణించిన భవికా మహేశ్వరి
అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. బాల రాముడు స్వర్ణ, వజ్రాభరణాలతో కొలువుదీరాడు. మూడంతస్తులుగా తలపెట్టిన మందిర నిర్మాణం ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పూర్తయింది. ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో నిర్మాణ పనులకు విరామం ప్రకటించిన అధికారులు.. మంగళవారం నుంచి తిరిగి మొదలు పెట్టనున్నారు. హిందువుల శతాబ్దాల కల అయిన రామ మందిరం నేడు సాకారమైంది. అయితే, ఈ మందిర నిర్మాణానికి దేశవిదేశాల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. ఎంతగా అంటే.. ఒక దశలో విరాళాలు ఇక చాలు, ఎవరూ విరాళం ఇవ్వొద్దంటూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించాల్సి వచ్చింది.
ఈ క్రమంలో రామ మందిర నిర్మాణానికి ఓ చిన్నారి కూడా తన వంతుగా విరాళం అందజేసింది. రామాయణ పారాయణ చేస్తూ దేశవ్యాప్తంగా 50 వేల కిలోమీటర్లు తిరిగి రూ.52 లక్షలు సేకరించి రాముడికి సమర్పించింది. సూరత్ కు చెందిన భవికా మహేశ్వరి పదకొండేళ్ల వయసులో విరాళాల సేకరణ మొదలుపెట్టింది. మూడేళ్ల పాటు దేశంలోని వివిధ నగరాలలో రామాయణ పారాయణం, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ విరాళాలు సేకరించింది. బహిరంగ సభలలో, కరోనా సమయంలో ఐసోలేషన్ సెంటర్లలో, జైళ్లలోనూ రామాయణ పురాణ పఠనం చేసింది. 2021లో లాజ్ పూర్ జైలులో ఖైదీలకు రామాయణం వినిపించగా.. 3200 మంది ఖైదీలు రూ.లక్ష విరాళంగా అందించారు. ఇలా మూడేళ్లపాటు దేశమంతా తిరుగుతూ రూ.52 లక్షల విరాళాలు సేకరించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేసింది.