Ayodhya Ram Mandir: రేపటి నుంచే సామాన్య భక్తులకు శ్రీరాముడి దర్శనం.. అయోధ్యలో దర్శన వేళలు, హారతి సమయాలు ఇవే!
- ఉదయం 7 - 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీరాముడి దర్శన వేళలు
- ఉదయం 6:30 గంటలకు, రాత్రి 7:30 గంటలకు హారతి సమయాలు
- ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పాస్‌లు పొందే అవకాశాన్ని కల్పించిన అయోధ్య ఆలయ ట్రస్ట్
యావత్ దేశం, సమస్త హిందూ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూసిన అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం వైభవోపేతంగా ముగిసింది. రాముడి జన్మస్థలంలో వేద మంత్రోచ్చారణ, జైశ్రీరామ్ నినాదాల మధ్య జరిగిన ఈ మహాఘట్టంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అతిరథ మహారథులు ఎందరో పాల్గొన్నారు. అయితే సాధారణ భక్తులకు మంగళవారం (జనవరి 23) నుంచి రామ్‌లల్లా దర్శనమివ్వనున్నాడు. ఈ మేరకు అయోధ్య రామాలయం భక్తులకు స్వాగతం పలుకుతోంది. అయితే అయోధ్య వెళ్లే భక్తులు దర్శన వేళలు, పాస్‌లు ఏవిధంగా పొందాలి వంటి కొన్ని విషయాలను ముందే తెలుసుకొని వెళ్లడం మంచిది.
దర్శనం, హారతి సమయాలు..
భక్తులు ఉదయం ఉదయం 7 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీరాముడి దర్శనం చేసుకోవచ్చు. ఇక ఉదయం 6:30 గంటలకు ఉదయం హారతి, రాత్రి 7:30 గంటలకు సంధ్యా హారతిని వీక్షించవచ్చు.
పాస్‌లు ఎలా పొందాలి?
'హారతి' లేదా 'దర్శనం'లో పాల్గొనేందుకు భక్తులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా పాస్‌లు పొందొచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు అయోధ్య రామ మందిరం అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. మొబైల్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా వ్యక్తుల గుర్తింపు నిర్ధారణ అవుతుంది. అనంతరం 'మై ప్రొఫైల్' సెక్షన్‌పై క్లి చేయాలి. హారతి లేదా దర్శనంలో కావాల్సిన స్లాట్‌ను ఎంచుకోవాలి. అవసరమైన వివరాలను నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత వివరాలన్నింటిని చెక్ చేసుకొని బుకింగ్‌ను పూర్తి చేసి పాస్‌ను పొందొచ్చు. ప్రవేశానికి ముందు ఆలయం కౌంటర్ వద్ద భక్తులు పాస్‌ను పొందొచ్చు. కాగా ప్రస్తుతం ఆన్‌లైన్ బుకింగ్ ప్రస్తుతం హోల్డింగ్‌లో ఉంది. అధికారులు మరికొన్ని గంటల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇక ఆఫ్‌లైన్ పాస్‌లు పొందాలనుకునేవారు ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి పాస్‌ను పొందొచ్చని అయోధ్య ఆలయ ట్రస్ట్ వెబ్‌సైట్ చెబుతోంది. అదే రోజున పాస్‌లను బుక్ చేసుకోవాలనుకునే వారి విషయంలో ‘తొలుత వచ్చిన వారికే తొలి ప్రాధాన్యం’ సూత్రం ఆధారంగా పాస్‌లను అందజేస్తారు. హారతికి 30 నిమిషాల ముందు ఆలయం వద్ద ఉండాలి. పాస్‌లపై క్యూఆర్ కోడ్‌ల ఆధారంగా సులభంగా భక్తులను అనుమతిస్తారని అయోధ్య ఆలయ ట్రస్ట్ వెబ్‌సైట్ పేర్కొంది. ఇక ఆలయం వద్దకు చేరుకోవడానికి భక్తులకు స్థానిక రవాణా సౌకర్యాలను కూడా అందిస్తోంది. ఆటో-రిక్షాలు, సైకిల్ రిక్షాల ద్వారా సరయు నది ఒడ్డున ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు.