Anganwadi protest: మహిళా కానిస్టేబుల్‌ని ఈడ్చిపడేసిన అంగన్వాడీ కార్యకర్తలు.. వీడియోను పోస్ట్ చేసిన అయ్యన్నపాత్రుడు!
- ‘ఛలో విజయవాడ’కు వెళ్తుండగా అడ్డుకోవడంపై అంగన్వాడీల ఆగ్రహం
- రోడ్డుపై అడ్డగించడంతో ‘మీరు కూడా రోడ్డు మీద కూర్చోండి’ అంటూ మహిళ కానిస్టేబుల్‌పై కార్యకర్తల ఆగ్రహం
- ‘ఎక్స్’ వేదికగా వీడియోను షేర్ చేసిన టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు
తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు.. విధుల్లో చేరనివారిని తొలగించాలంటూ జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు.. వెరసి ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ‘ఛలో విజయవాడ’కు పిలుపునివ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. చాలా చోట్ల కార్యకర్తలను రోడ్లపై నిలువరించారు.
ఈ క్రమంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ చోట పోలీసులపై అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఎంతసేపు కూర్చొబెడతారంటూ మండిపడ్డారు. ‘మీరు కూడా రోడ్డు మీద కూర్చోండి’ అంటూ మహిళా కానిస్టేబుళ్లను అంగన్వాడీ కార్యకర్తలు ఈడ్చిపడేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు. ‘‘అంగన్వాడీ కార్మికుల తిరుగుబాటు మొదలైంది. మానవత్వం లేని జగన్ పతనం ప్రారంభం అయ్యింది’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘జస్టిస్ ఫర్ అంగన్వాడీస్’, ‘వై ఏపీ హేట్స్ జగన్’ అనే హ్యాష్ ట్యాగులను ఆయన జోడించారు. కాగా ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది.