Shooting: అమెరికాలో దారుణం.. షికాగోలో ఏడుగురిని కాల్చిచంపి పరారైన దుండగుడు
- ఇల్లినాయ్ రాష్ట్రంలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన దుండగుడు
- ఏడుగురు చనిపోయినట్టు తెలిపిన పోలీసు అధికారులు
- పరారీలో ఉన్న దుండగుడు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సూచించిన పోలీసులు
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇల్లినాయ్ రాష్ట్రంలోని షికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఏడుగురి ప్రాణాలు తీశాడు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసు అధికారులు వెల్లడించారు. దుండగుడి కోసం వేట కొనసాగిస్తున్నామని తెలిపారు. నగరంలో జోలియట్‌లోని వెస్ట్ ఎకర్స్ రోడ్‌లో ఉన్న 2200 బ్లాక్‌లో ఈ కాల్పుల ఘటన జరిగిందని, నిందితుడిని రోమియో నాన్స్ గా గుర్తించామని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని వివరించారు. రెండు ఇళ్లపై కాల్పులు జరిపాడని, మొత్తం ఏడుగురు మృత్యువాతపడ్డారని జోలియట్ పోలీసు చీఫ్ బిల్ ఎవాన్స్ మీడియాకు వెల్లడించారు.
నిందితుడు నాన్స్(23) కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే నివసిస్తాడని తెలిపారు. ఎరుపు రంగు టయోటా క్యామ్రీ కారులో పరారైనట్టు భావిస్తున్నామని, అతడి వద్ద ఆయుధం ఉందని, అతడిని ప్రమాదకరంగా పరిగణించాలని అక్కడి పౌరులను జోలియట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తం చేసింది. నాన్స్‌కు సంబంధించిన సమాచారం, అతడి జాడకు సంబంధించి ఏమైనా తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కాగా అగ్రరాజ్యం అమెరికా కాల్పుల ఘటనలతో వణికిపోతోంది. గణనీయ సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మొదటి మూడు వారాల్లోనే 875 తుపాకీ కాల్పుల మరణాలు నమోదయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.