Ayodhya Ram Mandir: అయోధ్యలో... భక్తుల కిటకిట.. జేబుదొంగల చేతివాటం!
- అయోధ్యలో నిన్న చారిత్రక ఘట్టం
- జన్మభూమిలో కొలువైన బాలరాముడు
- వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రద్దీగా మారిన అయోధ్య
- ఇదే అదనుగా రెచ్చిపోయిన జేబుదొంగలు
అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నిన్న వేలాది మంది తరలి వచ్చారు. దేశం నలుమూలల నుంచి ప్రముఖులు, సాధువులు, రామ భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అయోధ్య కిటకిటలాడిపోయింది. ఇక ఈ రోజు సామాన్య జనానికి దర్శనానికి అనుమతించడంతో మరింతగా జనం కిక్కిరిసిపోయారు. ఇదే అదనుగా జేబుదొంగలు రెచ్చిపోతూ, తమ చేతివాటం ప్రదర్శించారు.
అయోధ్య వీధుల్లో ఏర్పడిన రద్దీని అవకాశంగా ఉపయోగించుకున్న జేబుదొంగలు... హ్యాండ్ బ్యాగులను, జేబులను లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా తమ పనితనాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా, రామ మందిరంలోకి ప్రవేశించే గేట్ల వద్ద భారీ జనసమూహాలు గుమికూడడంతో, జేబుదొంగల పని బాగా సులువైంది.
గత రాత్రి నుంచి ఆలయ ప్రవేశం కోసం వేచి ఉన్న భక్తులు, ఈ రోజు ఉదయం 7 గంటలకు గేట్లు తెరిచేసరికి ఒక్కసారిగా తోసుకుని వచ్చారు. ఇదే అదనుగా జేబుదొంగలు విజృంభించారు.
పాపం... కెనడా నుంచి వచ్చిన పూర్ణిమ అనే భక్తురాలు తన హ్యాండ్ బ్యాగులో విలువైన వస్తువులు, డబ్బు పోయిన విషయం గుర్తించి లబోదిబోమన్నారు. ఆమె స్నేహితురాలు ప్రాప్తి కూడా జేబుదొంగల బాధితురాలయ్యారు.
స్నేహితురాలికి తోడుగా అయోధ్య వచ్చిన ప్రాప్తి కూడా విలువైన వస్తువులు పోగొట్టుకున్నారు. ఆమె స్లింగ్ బ్యాగ్ జిప్ తెరిచిన జేబుదొంగలు ఏటీఎమ్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలను ఎత్తుకెళ్లారు. వీళ్లిద్దరే కాదు... అయోధ్యలో అనేక మంది భక్తులు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు.