sridhar babu: ఆరు గ్యారెంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం: శ్రీధర్ బాబు
- ఎన్నికలకు ముందు మంచి మేనిఫెస్టోను అందించామన్న శ్రీధర్ బాబు
- అధికారంలోకి వచ్చిన రెండో రోజునే ఉచిత బస్సు పథకం ప్రారంభించామని వెల్లడి
- ఆరు గ్యారెంటీలపై ప్రతిపక్షాల విమర్శలు తొందరపాటు చర్య అన్న మంత్రి
ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మంగళవారం మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు మంచి మేనిఫెస్టోను అందించామన్నారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను పొందుపరిచామని... వాటిని అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన రెండో రోజునే మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం, ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఎంతో విశ్వాసం చూపించారని.. వారికి ఇచ్చిన మాట ప్రకారం పథకాలు ఇచ్చి తీరుతామన్నారు. అయితే ఆరు గ్యారెంటీలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు తొందరపాటు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు.