Chandrababu: చిట్టంపాడు గ్రామంలో వరుస మరణాలపై చంద్రబాబు విచారం
- 15 రోజుల వ్యవధిలో ముగ్గురి మృతి
- ఇటీవలే తల్లీబిడ్డల మృతి
- తాజాగా మరో చిన్నారి మృత్యువాత
- మనసు కలచివేస్తోందన్న చంద్రబాబు
- పేదలు చనిపోతే అంబులెన్స్ ఇవ్వరా? అంటూ ఆగ్రహం
విజయనగరం జిల్లా చిట్టంపాడు గ్రామంలో వరుస మరణాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత 15 రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా చిన్నారి ప్రవీణ్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందగా... కొన్నిరోజుల కిందట ఓ తల్లీబిడ్డ మృత్యువాతపడ్డారు. ఈ వరుస మరణాలపై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. అదే వ్యధ, అదే దారుణం అంటూ ఎక్స్ లో స్పందించారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో గంగమ్మ, ఆమె 6 నెలల కొడుకు మరణించి 15 రోజులు కూడా గడవకముందే అదే గ్రామంలో ఏడాదిన్నర వయసున్న మరో చిన్నారి ప్రవీణ్ మరణించాడన్న వార్త మనసును కలచివేసిందని తెలిపారు.
"అనారోగ్యంతో బాధపడుతున్న ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఏడు కిలోమీటర్లు మోసుకెళ్లారు. బిడ్డ చనిపోయాక మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ ఇవ్వకపోతే రూ.3 వేలు అప్పుచేసి ప్రైవేటు వాహనంలో రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చారు. పేదలు చనిపోతే వారి మృతదేహాలు తరలించడానికి అంబులెన్స్ ఇవ్వరా? రాష్ట్రంలో ఏమిటీ అమానవీయ పరిస్థితి? ఈ పెత్తందారు ముఖ్యమంత్రికి ఎలాగూ పేదల గోడు పట్టదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరుతున్నా... కనీసం మీరైనా దయచేసి ఆ అడవి బిడ్డల మరణ ఘోషపై ఒక్కసారి సమీక్ష చేయండి... తగిన చర్యలు తీసుకోండి" అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
విజయనగరం జిల్లా వరుస మరణాలపై ఓ పత్రికలో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్ ను కూడా చంద్రబాబు తన ట్వీట్ లో పంచుకున్నారు.