soyam bapu rao: ఫ్లెక్సీలు కడితే టిక్కెట్ ఇస్తారా? పని చేశానని భావిస్తే ఇస్తారు.. లేదంటే లేదు అంతే!: బీజేపీ ఎంపీ సోయం బాపూరావు
- గల్లీకో ఫ్లెక్సీ కట్టినంత మాత్రాన లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్ రాదని వ్యాఖ్య
- బీజేపీ ఎంపీ టిక్కెట్ అంగట్లో సరుకు కాదన్న సోయం
- నేను ఏం చేశానో పార్టీ అధిష్ఠానానికి తెలుసునన్న బాపూరావు
ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన టిక్కెట్ ఇస్తారా? తాను పని చేశానని పార్టీ అధిష్ఠానం భావిస్తే టిక్కెట్ ఇస్తుంది.. లేదంటే లేదు.. అంతేనని బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. మంగళవారం ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్ అంశానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గల్లీకో ఫ్లెక్సీ కట్టినంత మాత్రాన రానున్న లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్ రాదని... క్యాడర్ లేనివాడు ఎప్పటికీ లీడర్ కాలేడని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ టిక్కెట్ అంటే అంగట్లో సరుకు కాదని పేర్కొన్నారు.
తనపై కొంతమంది బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో గెలిచిన తర్వాత ఓ ఎంపీగా ఏం చేశానో పార్టీ అధిష్ఠానానికి తెలుసునని వ్యాఖ్యానించారు. బీజేపీ లోక్ సభ టిక్కెట్ కోసం పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పైనా సోయం బాపూరావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దొంగ పోరాటాలను తిప్పికొట్టాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.