Rajat Patidar: ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టులకు... కోహ్లీ స్థానంలో పాటిదార్!
- టీమిండియా, ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్
- వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం
- రజత్ పాటిదార్ తో కోహ్లీ స్థానం భర్తీ!
- మరోసారి సర్ఫరాజ్ ఖాన్ కు మొండిచేయి!
- ముగిసిన పుజారా, రహానే శకం
టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రేపటి నుంచి ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. అయితే, వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టులు ఆడడంలేదు. ఈ నేపథ్యంలో, కోహ్లీ స్థానాన్ని సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, ఛటేశ్వర్ పుజారాలలో ఒకరితో భర్తీ చేస్తారని ప్రచారం జరిగింది.
తాజాగా బీసీసీఐ సెలెక్టర్లు మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ వైపు మొగ్గుచూపినట్టు తెలిసింది. రజత్ పాటిదార్ ఇంగ్లండ్-ఏ జట్టుపై ఇటీవల భారీ సెంచరీ నమోదు చేసి ఫామ్ చాటుకున్నాడు.
పాటిదార్ ను భారత టెస్టు జట్టుకు ఎంపిక చేసిన నేపథ్యంలో, సెలెక్టర్లు సర్ఫరాజ్ ఖాన్ కు మరోసారి మొండిచేయి చూపినట్టు అర్థమవుతోంది. దేశవాళీ క్రికెట్లో గత కొన్ని సీజన్లుగా సర్ఫరాజ్ ఖాన్ అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. సెంచరీల మోత మోగిస్తూ, పరుగులు వెల్లువెత్తిస్తున్నా అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
అదే సమయంలో, పాటిదార్ ఎంపికతో సీనియర్ ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానేల శకం ముగిసినట్టయిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.