DMK MLA: పనిమనిషిపై ఎమ్మెల్యే కొడుకు, కోడలు వేధింపులు... పరారీలో నిందితులు

DMK MLA son and daughter in law on the run after police filed cases on them
  • చిక్కుల్లో డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కుమారుడు, కోడలు
  • పనిమనిషిని చిత్రహింసలు పెట్టినట్టు ఆరోపణలు
  • ఆరు సెక్షన్ల కింద కేసుల నమోదు
  • ఆచూకీ లేకుండా పోయిన ఎమ్మెల్యే కొడుకు, కోడలు
  • మూడు పోలీసు బృందాలతో గాలింపు
తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కుమారుడు ఆండ్రో మదివణన్, కోడలు మెర్లినా పరారీలో ఉన్నారు. పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో వారిద్దరిపై కేసు నమోదైంది. మదివణన్, మెర్లినా దంపతుల నివాసంలో ఓ యువతి పనిమనిషిగా చేరింది.

 అయితే, ఆమెను ఎమ్మెల్యే కొడుకు, కోడలు దారుణంగా వేధించేవారని, ఇంటి పనులు చేస్తున్నప్పటికీ హింసించేవారని ఆరోపణలు వచ్చాయి. మూడేళ్లు తమ వద్దే పనిచేయాలని ఒప్పంద పత్రంపై సంతకం చేయించుకున్నారని, పని మానేసి వెళ్లిపోతే ఆమె తల్లికి హాని తలపెడతామని బెదిరించేవారని వెల్లడైంది. అప్పుడప్పుడు శరీరంపై వాతలు పెట్టి, రక్తం వచ్చేలా కొట్టేవారని పోలీసులు పేర్కొన్నారు. 

ఇటీవల ఎమ్మెల్యే కొడుకు, కోడలు తమతో పాటు ఆ యువతిని ముంబయి తీసుకెళ్లారు. అక్కడ వంట సరిగా చేయలేదని ఆమెను చితకబాదారని, బలవంతంగా పచ్చి మిరపకాయ తినిపించారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 

యువతిని వేధించినట్టు ఫిర్యాదు అందిన నేపథ్యంలో, నీలాంగరై మహిళా పోలీసులు ఎమ్మెల్యే కొడుకు మదివణన్, కోడలు మెర్లినాలపై 6 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. 

ఆరు రోజుల క్రితం ఈ కేసులు నమోదు కాగా, అప్పటినుంచి మదివణన్, మెర్లినా ఆచూకీ లేకుండా పోయారు. దాంతో వారి కోసం మూడు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. కాగా, ఎమ్మెల్యే కొడుకు, కోడలు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
DMK MLA
Son
Daughter In Law
House Maid
Police
Tamil Nadu

More Telugu News