Jabardasth: కరోనాతో చనిపోయేవాడినే: 'జబర్దస్త్' రాజమౌళి
- 'జబర్దస్త్'తో రాజమౌళికి మంచి పేరు
- తాగుబోతు పాత్రలతో పాప్యులర్
- కరోనా కష్టాలను గురించిన ప్రస్తావన
- అదృష్టం కొద్దీ బ్రతికానని వెల్లడి
'జబర్దస్త్' కామెడీ షో చూసేవారికి కమెడియన్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కామెడీ స్కిట్స్ లో తను తాగుబోతుగా ఎక్కువ ఎపిసోడ్స్ చేశాడు. అలాగే అమాయకమైన పాత్రలలోను తను జీవిస్తాడు. ఇక ఆయనలో ఉన్న మరో ప్రత్యేకత పాటలు బాగా పాడటం .. ముఖ్యంగా పేరడీ సాంగ్స్. అలాంటి రాజమౌళి సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
" మాది చాలా పల్లెటూరు .. అందువలన చిన్నప్పటి నుంచి తాగుబోతులను చాలా దగ్గరగా చూశాను. ఆ సమయంలో వాళ్లు ఎలా మాట్లాడతారు .. ఎలా ప్రవర్తిస్తారు అనేది నాకు బాగా తెలుసు. ఇక అప్పట్లో మా నాన్న డ్రామాలు ఎక్కువగా వేసేవారు. ఆ డ్రామాలను చూస్తూ ఉండటం వలన నాకు నటన పట్ల ఆసక్తి ఏర్పడింది. కాలేజ్ రోజులకి వచ్చేసరికి మంచి గుర్తింపు వచ్చింది" అన్నాడు.
"నటుడిగా నా కెరియర్ మొదలుపెట్టిన తరువాత నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ కరోనా సమయంలో నాకు కరోనా వచ్చింది .. అది కూడా చాలా సీరియస్ అయింది. ఆ సమయంలో హాస్పిటల్లో చేర్చడం వలన చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అయింది. నేను చనిపోతాననే అంతా అనుకున్నారు. అదృష్టం కొద్దీ బ్రతికి బయటపడ్డాను" అని చెప్పాడు.