konathala ramakrishna: షర్మిలతో భేటీ వ్యక్తిగతం... రాజకీయ కోణం లేదు: కొణతాల రామకృష్ణ

Konathala Ramakrishna after meeting with Sharmila

  • వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందన్న కొణతాల
  • తామంతా అన్నదమ్ముల్లా.. కుటుంబ సభ్యుల్లా ఉండేవాళ్లమన్న మాజీ మంత్రి
  • తన ఇంటికి మేనకోడలు వచ్చినట్లుగా భావిస్తానన్న కొణతాల

వైఎస్ షర్మిలతో జరిగిన భేటీ కేవలం వ్యక్తిగతమని... రాజకీయ కోణం లేదని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. విశాఖలో షర్మిల.. కొణతాలను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనకు వైఎస్ రాజశేఖరెడ్డితో మంచి అనుబంధముందని... తామంతా అన్నదమ్ముల్లా... కుటుంబ సభ్యుల్లా ఉండేవాళ్లమని, అందుకే షర్మిల కలవడానికి వచ్చినట్లు చెప్పారు. వైఎస్ కుటుంబంతో బంధం ఇప్పటిది కాదని... ఎప్పటి నుంచో కొనసాగుతోందని చెప్పారు. షర్మిల పీసీసీ చీఫ్ అయ్యారని తాను రాలేదన్నారు. తనతో విజయమ్మ ఇప్పటికీ మాట్లాడుతుంటారని చెప్పారు.

అలాగే, తన కొడుకు పెళ్లికి ఆహ్వానించేందుకు కూడా షర్మిల వచ్చారన్నారు. తాను ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాననే విషయాన్ని షర్మిల చెప్పారన్నారు. అలాగే ముందు ముందు ఏం చేస్తారనే విషయాన్నీ చెప్పారన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? అని కొణతాలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే తనది వారితో వ్యక్తిగత అనుబంధం.. కుటుంబ సంబంధమే.. రాజకీయ బంధం కాదని ఆయన స్పష్టం చేశారు. విజయమ్మను తాను అక్కలా భావిస్తాను కాబట్టి... తన ఇంటికి మేనకోడలు వచ్చినట్లుగా భావిస్తానన్నారు. తమ కలయికను రాజకీయ కోణంలో చూడవద్దన్నారు. తాను ఎక్కడ ఉన్నా ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడుతానని కొణతాల అన్నారు.

పోలవరం పూర్తి చేయాల్సింది

పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని... చంద్రబాబు దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం పూర్తి చేశారని కొణతాల చెప్పారు. ఈ నాలుగున్నరేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కానీ అలా చేయలేకపోయారని విమర్శించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు వెన్నెముక వంటిదని... పోలవరం లేని ఏపీని ఊహించలేమన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించాలని గతంలో చెప్పిన జగన్ అలా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు.

షర్మిల తండ్రి బాటలో వెళితే చాలన్నారు. ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయాన్ని అందించారని జగన్ కూడా తండ్రి బాటలో వెళ్ళి ఉంటే బాగుండేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పోటీ ఇస్తుందా? లేదా? అంటే కాలమే నిర్ణయిస్తుందన్నారు. ప్రస్తుతం జనసేన.. బీజేపీతో కలిసి ఉందని, టీడీపీతో కలిశాక ఏం జరుగుతుందనేది చూద్దామన్నారు.

  • Loading...

More Telugu News