Maldives: మాల్దీవుల ప్రభుత్వంపై స్వదేశంలో తీవ్ర విమర్శలు..!
- భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తుండడమే కారణం
- అధికారపక్షంపై భగ్గుమంటున్న ప్రతిపక్ష పార్టీలు
- ఇది అభివృద్ధికి హానికరమని మండిపాటు
భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్న మాల్దీవుల ప్రభుత్వంపై స్వదేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వైఖరి దేశ అభివృద్ధికి హానికరంగా పరిణమించవచ్చునని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ (ఎండీపీ), డెమొక్రాట్స్ పార్టీల నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి భాగస్వామిని దూరం చేసుకోవడడం ఏమాత్రం సబబుకాదని, మరీ ముఖ్యంగా సుదీర్ఘకాలంగా మైత్రిని కొనసాగిస్తున్న దేశాన్ని దూరం చేసుకుంటే దీర్ఘకాలిక అభివృద్ధికి హానికరమని ఎండీపీ, డెమొక్రాట్ పార్టీల నేతలు విమర్శించారు.
భారత ప్రధాని మోదీ లక్షదీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల పర్యవసానంతో ఇరుదేశాల మధ్య దౌత్య బంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చైనాకు చెందిన గూఢచార నౌక మాల్దీవుల నౌకాశ్రయంలో తిష్ట వేయడం ఆసక్తికరంగా మారింది. భారత్‌తో దౌత్య బంధాలు దెబ్బతినడంతో మాల్దీవుల ప్రభుత్వం చైనా సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో రాజకీయ, సైనిక మార్పులు వచ్చాయని అక్కడి ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. భారత్‌ను దీర్ఘకాల మిత్రదేశంగా అభివర్ణించాయి. విదేశాంగ విధానంలో భాగంగా ప్రభుత్వం అన్ని అభివృద్ధి భాగస్వాములతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని విపక్ష నేతలు పేర్కొన్నారు.
మాల్దీవుల స్థిరత్వం, భద్రతకు హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం, శాంతి, భద్రత చాలా ముఖ్యమైనవని ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు సూచించాయి. ఈ మేరకు ఎండీపీ చైర్మన్ ఫయాజ్ ఇస్మాయిల్, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అహ్మద్ సలీమ్, డెమొక్రాట్స్ పార్టీ చీఫ్ హసన్ లతీఫ్, పార్లమెంటరీ గ్రూప్ లీడర్ అలీ అజీమ్‌లు ఉమ్మడి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంపై మండిపడ్డారు.
కాగా దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో భారత్ తన దళాలను ఉపసంహరించుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం చెప్పింది. ఇందుకు మార్చి 5 గడువు తేదీగా విధించింది. ఇక మాల్దీవుల నూతన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఎన్నికైన తర్వాత తొలి పర్యటనగా చైనా వెళ్లారు. గత అధ్యక్షులకు ఆయన భిన్నంగా వ్యవహరించారు. గత అధ్యక్షులు తొలి పర్యటనగా భారతదేశాన్ని సందర్శించేవారు.