Hyderabadi Biryani Tea: బిర్యానీ టీ.. హైదరాబాద్‌లో ప్రస్తుతం ట్రెండ్ ఇదే!
- బిర్యానీలో వాడే మసాలాలతో టీ తయారు చేస్తున్న వ్యాపారులు
- జనాలకు ఈ కొత్త రుచి నచ్చడంతో బిర్యానీ టీకి పెరుగుతున్న డిమాండ్
- నగరంలో పలు చోట్ల వెలస్తున్న బిర్యానీ టీ స్టాళ్లు
హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్. దీనికి జతగా ఇప్పుడు బిర్యానీ టీ కూడా వచ్చి చేరింది. ప్రస్తుతం నగరంలో ఈ సరికొత్త ట్రెండ్ వేళ్లూనుకుంటోంది. బిర్యానీ రుచిని టీకి జత చేయాలన్న ఆలోచనలోంచే పుట్టిన ఈ బిర్యానీ టీ నగరవాసుల మన్ననలు పొందుతోంది. చాలా చోట్ల బిర్యానీ టీ స్టాళ్లు కూడా పుట్టుకొచ్చాయి.
ఏమిటీ బిర్యానీ టీ?
బిర్యానీ టేస్టుకు ప్రధాన కారణం అందులో వాడే మసాలా దినుసులే! ఇక భారతీయులందరూ ఇష్టపడే ఒకే ఒక్క పానీయం టీ. ఈ రెండింటినీ ఓచోట చేర్చి తయారు చేసేదే బిర్యానీ టీ. వేడి నీళ్లల్లో స్ట్రాంగ్ టీపొడితో పాటూ బిర్యానీలో వాడే ఆకులు, దాల్చిన చెక్కలు, మసాలా దినుసులు, సోంపు, కావాల్సినన్ని యాలకులు, నల్లమిరియాలు, గసగసాలు, అర టీస్పూన్ ఫెన్నెల్, అర టీస్పూన్ టీ ఆకులు జోడించి దీన్ని తయారు చేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టీ వెరైటీలకంటే భిన్నంగా ఉన్న ఈ పానీయం నగరవాసులకు బాగా నచ్చడంతో అనేక చోట్ల బిర్యానీ టీ స్టాళ్లు ప్రారంభమవుతున్నాయి. పేరుకే బిర్యానీ టీ అయినా దీనికి బిర్యానీ రుచితో ఏమాత్రం సంబంధం ఉండదు. కేవలం మసాలాలను మాత్రమే జోడించడంతో ఈ టీ తనదైన కొత్త రుచి సంతరించుకుంది. మసాలా చాయ్‌ని తలదన్నేలా ఉంటుంది. అసలే ఇది శీతాకాలం కావడంతో కొత్త టీ ఫ్లేవర్ జనాలను ఉర్రూతలూగిస్తోంది.