Canada: కెనడా ఎన్నికల్లో విదేశీ శక్తుల జోక్యంపై విచారణలో భారత్‌ పేరు

Canada names India in probe of foreign interference in elections

  • జోక్యం అవకాశాలపై భారత్‌ సమాచారం కోరిన విచారణ కమిషన్
  • కెనడా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద ఉన్న డాక్యుమెంట్లను కోరిన కమిషన్
  • తాజా పరిణామంతో భారత్ - కెనడా దౌత్య సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశం

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య పర్యవసానాలతో భారత్ - కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ దేశ ఎన్నికల్లో విదేశీ శక్తుల జోక్యంపై జరుపుతున్న విచారణలో భారత్ పేరును కెనడా చేర్చింది. ఎన్నికల్లో భారత్ జోక్యం అవకాశాలపై తాము కోరిన సమాచారం అందించాలని కెనడా ప్రభుత్వాన్ని స్వతంత్ర విచారణ కమిషన్ కోరింది.

 2019, 2021 ఎన్నికల్లో భారత్ జోక్యానికి సంబంధించిన డాక్యుమెంట్లను అందజేయాలని కెనడా ప్రభుత్వాన్ని కోరినట్టు కమిషన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆరోపణలకు సంబంధించి ఫెడరల్ ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారాన్ని పరిశీలించనున్నట్టు తెలిపింది. పూర్తిగా పరిశీలించిన తర్వాత విదేశీ జోక్యం గుర్తింపు, దీనిని అరికట్టడానికి సంబంధించిన సిఫార్సులను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలిపింది. కాగా విదేశీ శక్తుల జోక్యంలో భారత్ పేరును చేర్చడంపై అట్టావాలోని భారత హైకమిషన్‌ను బుధవారం సంప్రదించగా స్పందించలేదు. కాగా ఈ తాజా పరిణామం ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ఇరుదేశాల సంబంధాలను మరింత దెబ్బతీయవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా ప్రయత్నించిందని, దీనిపై దర్యాప్తు చేయాలంటూ ఒత్తిడి పెరిగిపోవడంతో గతేడాది సెప్టెంబర్‌లో దర్యాప్తు కోసం ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. బహిరంగ విచారణ మొదలుపెట్టింది. అయితే ఈ ఆరోపణలను చైనా ఖండిస్తోంది. ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఇప్పటికే చాలాసార్లు తోసిపుచ్చింది. కాగా కెనడా వ్యవహారాల్లో చైనా, రష్యా, ఇతర దేశాల జోక్యానికి సంబంధించిన ఆరోపణలపై న్యాయమూర్తి మేరీ జోసీ హోగ్ నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుపుతోంది. మే 3 నాటికి మధ్యంతర నివేదికను, ఈ ఏడాది చివరి నాటికి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయనుందని అంచనాగా ఉంది.

  • Loading...

More Telugu News