Tamilisai Soundararajan: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రసంగంపై.. ఈసీ చర్యలు తీసుకోవాలన్న గవర్నర్ తమిళిసై
- జేఎస్‌టీయూలో జరిగిన నేషనల్ ఓటర్స్ డే వేడుకల్లో గవర్నర్ ప్రసంగం
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రసంగంపై ఆగ్రహం
- తనకు ఓటువేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ అభ్యర్థి వ్యాఖ్యానించారంటూ అభ్యంతరం
- ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి విజ్ఞప్తి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. నేడు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో జరిగిన నేషనల్ ఓటర్స్ డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై, సీఈఓ వికాస్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై కౌశిక్ రెడ్డి ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
‘‘ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి అన్నారు. ఎన్నికల కమిషన్ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. ఓటర్లను ఎవరూ బెదిరించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఓటు అనేది మోస్ట్ పవర్‌ఫుల్ ఆయుధం. ప్రజాస్వామ్యం బతకాలంటే ఓటు వేయాలి. మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుంది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి’’ అని గవర్నర్ అన్నారు.
గతేడాది నవంబర్ 28న ఎన్నికల ప్రచారం సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తమ జీవితాలు, ప్రాణాలు ప్రజల చేతుల్లో పెడుతున్నామని వ్యాఖ్యానించారు. ఎన్నికల తరువాత తమ విజయయాత్రకు రావాలో, లేక శవ యాత్రకు రావాలో మీరే ఆలోచన చేయండి అని ప్రజలను ఉద్దేశించి ఆయన భావోద్వేగంగా అన్నారు.