Jai Bharat National Party: జై భారత్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ... వివరాలు ఇవిగో!
- ఇటీవలే పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- త్వరలో ఏపీలో ఎన్నికలు
- అన్ని రకాల అంశాలను స్పృశిస్తూ మేనిఫెస్టో రూపకల్పన
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీ పేరిట రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కొన్ని రోజుల కిందట ప్రకటించిన లక్ష్మీనారాయణ... నేడు తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.
ఇవాళ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మేనిఫెస్టో తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. ఇది ప్రజల నుంచి వచ్చిన ప్రజా మేనిఫెస్టో అని వివరించారు. అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే జై భారత్ పార్టీ మేనిఫెస్టోకు రూపకల్పన చేశామని చెప్పారు. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గొప్పగా ఆలోచించే వ్యక్తులతో నిండిన రాష్ట్రం అని, మంచి తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
కానీ, ప్రస్తుతం రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఎంత అప్పుల్లో ఉంది అని అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని ఎలా బయటికి తీసుకురావాలన్నదే జై భారత్ పార్టీ మేనిఫెస్టో ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేశారు.
మా మేనిఫెస్టో హైలైట్స్ ఇవే: లక్ష్మీనారాయణ
- అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యత. ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేస్తాం. అన్ని ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తాం.
- రైతుకు చేయూత కింద సంవత్సరానికి రూ.10 వేలు ఇస్తాం. ఖరీఫ్ సీజన్ కు రూ.5 వేలు, రబీ సీజన్ కు రూ.5 వేలు ఇస్తాం.
- స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు రైతులకు మద్దతు ధర అందిస్తాం.
- స్వామినాథన్ వ్యవసాయ కార్మిక ఉపాధి హామీ పథకం కింద ప్రతి రైతుకు రూ.5 వేలు అందిస్తాం.
- 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకే ఈ పథకాలు వర్తింపజేస్తాం.
- కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, బ్యాంకుల్లో రుణాలు లభించేలా చేస్తాం.
- చట్టబద్ధ అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రస్థాయిలో ప్రత్యేక విత్తన చట్టం తీసుకువస్తాం.
- సంప్రదాయ విత్తన బ్యాంకులు ఏర్పాటు చేస్తాం.
- విపత్తుల సమయంలో రైతులకు ఎకరానికి రూ.15 వేల రూపాయలు చెల్లిస్తాం. ఈ పరిహారాన్ని 15 రోజుల్లో చెల్లిస్తాం.
- ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించడానికి పెద్దపీట వేస్తాం.
- ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తాం.
- గ్రామీణ ఉపాధి హామీ పథకం తరహాలో పట్టణ ప్రాంతాల వారికి పట్టణ ఉపాధి హామీ పథకం తీసుకువస్తాం. దేశంలోనే ఇది మొదటిసారి.
- ప్రతి ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేస్తాం.
- ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 సందర్భంగా గ్రూప్-2 నోటిఫికేషన్ తీసుకువస్తాం.
- సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం.
- అక్టోబరు 21 సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల నోటిఫికేషన్ ను విడుదల చేస్తాం.
- గ్రూప్-1 రాసినవాళ్లు... ఒక్కో నోటిఫికేషన్ కు తగినంత వ్యవధి ఉండడంతో, మిగతా ఉద్యోగాలకు కూడా ప్రయత్నించవచ్చు.
- మద్యపానం గురించి జై భారత్ పార్టీ వినూత్న విధానం తీసుకువస్తుంది. ఏ పంచాయతీలో అయినా, ఏ మున్సిపాలిటీలో అయినా వారి సర్వసాధారణ సభల్లో 50 శాతం మంది మహిళలు తమ ప్రాంతంలో మద్యం దుకాణాలు వద్దు అంటే, ఆ ప్రాంతంలో మద్యం దుకాణాలు రద్దు చేస్తాం.
- మద్యపానానికి పర్మిట్ విధానం ప్రవేశపెడుతున్నాం. రాష్ట్రంలో ఎవరైనా మద్యం సేవించాలంటే వాళ్లు అనుమతి తీసుకోవాలి. ఆ పర్మిట్ ఎలా ఉంటుందంటే... ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత మద్యం ఇవ్వరు. వాళ్ల ఆధార్ కార్డుతో లింక్ చేస్తారు.
- 21 సంవత్సరాలు నిండినవాళ్లకే మద్యం తాగేందుకు పర్మిట్లు ఇస్తారు.
- అన్నీ డిజిటల్ చెల్లింపులే ఉంటాయి.
- బెల్టు షాపులను 100 శాతం నిర్మూలిస్తాం.
- అన్ని డిస్టిలరీల్లో అత్యంత నాణ్యమైన మద్యం తయారు చేసేలా చర్యలు తీసుకుంటాం.
- నాణ్యమైన రోడ్లను నిర్మిస్తాం. సమగ్రమైన రోడ్డు భద్రతా చట్టాన్ని తీసుకువస్తాం.
- కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తాం. గుజరాత్ వంటి రాష్ట్రంలో 21 ఎయిర్ పోర్టులు ఉంటే, ఏపీలో 6 మాత్రమే ఉన్నాయి. ఈ విషయంలో జై భారత్ నేషనల్ పార్టీ కృషి చేస్తుంది.
- జై భారత్ పార్టీ విధానంలో ముఖ్యమంత్రి ముఖ్యం కాదు, గ్రామ సర్పంచి ముఖ్యం.
- ప్రతి గ్రామ పంచాయతీకి ఏడాదికి రూ.1 కోటి బడ్జెట్ అందిస్తాం.
- ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఏడాది రూ.100 కోట్లు ఇస్తాం. ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి నియోజకవర్గానికి రూ.500 కోట్లు ఇస్తాం.
- జిల్లాల్లో పండే పంటల ఆధారంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు స్థాపిస్తాం.
- ప్రతి గ్రామ పంచాయతీలో 10 ఎకో ఫ్రెండ్లీ పరిశ్రమల ఏర్పాటు చేస్తాం.
- ప్రతి మండలం నుంచి ఒక మోడల్ విలేజ్ ను ఎంపిక చేసి రూ.1 కోటి ప్రోత్సాహం ఇస్తాం.
- ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం, ప్రతి గ్రామాల్లో ఫంక్షన్ హాళ్ల నిర్మాణం కోసం పంచాయతీలకు రూ.50 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ కేటాయిస్తాం.
- సబ్సిడీపై ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఇస్తాం. విద్యుత్ బిల్లులు లేని విధంగా సోలార్ ఎలెక్ట్రిసిటీ ఇస్తాం.
- ప్రతి నియోజకవర్గానికి ఒక నిమ్స్ స్థాయి హాస్పిటల్ ఏర్పాటు. ప్రతి జిల్లాకు ఒక ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్ నిర్మిస్తాం.
- ప్రతి మండలంలో ప్రభుత్వ మెడికల్ దుకాణం ఏర్పాటు చేస్తాం. దాంట్లో ధరలు తక్కువగా ఉంటాయి.
- నాణ్యమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రతి ఇంటికీ ఒక వాటర్ ప్యూరిఫయర్ అందిస్తాం.
- అందరికీ బీమా పథకం అందిస్తాం. తెల్ల కార్డులు ఉన్న వారికి ఆరోగ్య శ్రీ ఉంది. తెల్ల కార్డులు లేని వారిని కూడా బీమా పరిధిలోకి తీసుకువస్తాం.
- ప్రజలను ఆస్తిపరులుగా తయారుచేసి, తెల్ల రేషన్ కార్డుల సంఖ్యను తగ్గిస్తాం.
- ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ధరలు వసూలు చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున చికిత్స ధరలు నిర్ణయిస్తాం.
- ప్రతి నియోజకవర్గానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్కూలు ఏర్పాటు చేస్తాం.
- ప్రతి జిల్లాకు ఒలింపిక్ స్థాయి క్రీడా శిక్షణ సంస్థను స్థాపిస్తాం.
- 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్కరికీ సైనిక శిక్షణ ఇస్తాం.
- బడ్జెట్ స్కూళ్లపై ఉన్న వాణిజ్య పన్నులు, ఆస్తి పన్నులు, విద్యుత్, నీటి బిల్లులు మినహాయిస్తాం.
- ప్రతి మండలానికి రూ.2 కోట్లతో డాక్టర్ అబ్దుల్ కలాం నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేస్తాం. ఇందులో లైబ్రరీ, స్పోకెన్ ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్, కంప్యూటర్ కోర్సులు అ అందుబాటులో ఉంటాయి.
- ప్రతి జిల్లాకు ఒక పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తాం.
- మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం. డ్వాక్రా గ్రూపులకు వడ్డీలేని రుణాలు ఇస్తాం. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నైపుణ్యం, సాంకేతిక తోడ్పాటు అందించేందుకు రాష్ట్రస్థాయి స్వయం సహాయక సంఘాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.
- పనిచేసే మహిళలకు సబ్సిడీపై ఎలెక్ట్రిక్ బైకులు అందిస్తాం.
- బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో మహిళల కోసం హాస్టళ్లు నిర్మిస్తాం.
- రాష్ట్రంలో ఒక అమ్మాయి పుడితే, ఆ అమ్మాయి పేరున ఒక టేకు చెట్టు గానీ, ఒక ఎర్రచందనం చెట్టు గానీ నాటిస్తాం. ఆ అమ్మాయి పెరిగి పెద్దదయిన తర్వాత, ఈ చెట్లే ఆస్తిగా మారబోతున్నాయి. రాజస్థాన్ లోని ఒక గ్రామంలో అమ్మాయి పుడితే 11 చెట్లు నాటుతారు. ఆ అమ్మాయి యుక్త వయస్సుకు రాగానే ఆ అమ్మాయికి ఆస్తిగా ఈ చెట్లను ఇస్తారు. ఈ పథకమే మాకు స్ఫూర్తి.
- వితంతు పునర్ వివాహాలను కూడా ప్రోత్సహిస్తాం.
- ఇంటిలో సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఆ రోడ్డున పడుతోంది. అందుకే ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల జీవిత బీమా సౌకర్పం కల్పిస్తాం.
- రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర పన్ను తగ్గించే నిర్ణయం తీసుకుంటాం.
- ఇంటివద్ద నుంచే ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. ప్రజలు ఫోన్ కాల్ చేస్తే పోలీసులే ఇంటి వద్దకు వస్తారు. చట్టంలో ఆ మేరకు మార్పులు చేస్తాం
- గ్రామీణ కోర్టులు ఏర్పాటు చేస్తాం. మీ కేసులను మీకు దగ్గర్లోనే పరిష్కరించుకోవచ్చు.
- విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, గర్భిణీలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం.
- భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతాం.
- డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ను తయారుచేస్తాం.
- అవినీతి ఏ రూపంలో ఉన్న కఠిన చర్యలు తీసుకుంటాం.
- ప్రతి పట్టణానికి 50 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ తీసుకువస్తాం. చెత్త నుంచి సంపద సృష్టి, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులు తీసుకువస్తాం.
- ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదు. ప్రత్యేక హోదా అనేది మన హక్కు. అందుకోసం ప్రణాళికలు ఉన్నాయి.
- కొత్త పరిశ్రమలకు జీరో కాస్ట్ ఎంట్రీ కల్పిస్తాం. పరిశ్రమ సాగిన తర్వాత మూడేళ్లకు కొద్ది కొద్దిగా చెల్లింపులు చేసేలా వెసులుబాటు కల్పిస్తాం.
- ప్రతి జిల్లాలో ప్రభుత్వమే ఐటీ కాంప్లెక్స్ లు కట్టి ఐటీ కంపెనీలకు ఇస్తుంది. ఐటీ కంపెనీల స్థాపన సులభతరం చేస్తాం.