Jatayuvu: జటాయువు విగ్రహం రూపకల్పన కోసం విస్తృత పరిశోధన చేసిన శిల్పులు

Huge research behind Jatayuvu statue making

  • సీతను రావణుడి నుంచి కాపాడే యత్నంలో మరణించిన జటాయువు
  • రామాయణంలో జటాయువుకు ఎంతో ప్రాశస్త్యం
  • అయోధ్య రామ జన్మభూమిలో జటాయువు విగ్రహం
  • ఈ నెల 22న ప్రారంభించిన ప్రధాని మోదీ 

అయోధ్య బాలక్ రామ్ (రామ్ లల్లా) ఆలయ ప్రాంగణంలో జటాయువు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం, ప్రధాని మోదీ రామ జన్మభూమి సముదాయంలోనే ఏర్పాటు చేసిన జటాయువు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. రామాయణంలో ఎంతో విశిష్టత కలిగిన ఈ భారీ పక్షి విగ్రహం రామభక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

కాగా, ఈ జటాయువు విగ్రహాన్ని రూపొందించడానికి ప్రముఖ శిల్పి రామ్ సుతార్ (99), ఆయన తనయుడు అనిల్ సుతార్ (66) విస్తృత అధ్యయనం చేశారు. ఈ పక్షి రూపురేఖలు, తదితర అంశాల పరిశోధనకే రెండు నెలల సమయం పట్టింది. అందుకోసం, ఆ తండ్రీతనయులు రాబందుల శరీర నిర్మాణ శాస్త్రాన్ని కూడా అవగాహన చేసుకున్నారు. 

అన్ని విధాలా రామాయణంలోని జటాయువు ఇలా ఉంటుంది అని నిర్ధారణ చేసుకున్నాకే రంగంలోకి దిగారు. మొదట చిన్న పక్షి రూపంలో నమూనాలు సిద్ధం చేసుకున్నారు. వాటి ఆధారంగా పెద్ద పక్షి శిల్పాన్ని రూపొందించారు. 

ఈ దివ్య పక్షి విగ్రహం బరువు 3.5 టన్నులు. రామ్ సుతార్, అనిల్ సుతార్ ఈ విగ్రహాన్ని నోయిడాలోని తమ వర్క్ షాప్ లో రూపొందించారు. ఈ విగ్రహం పొడవు 20 అడుగులు. ఈ విగ్రహంలో 85 శాతం రాగి వినియోగించారు. ఇక, జింకు, సీసం, తగరం వంటి లోహాలను 5 శాతం చొప్పున ఉపయోగించారు. దీన్ని ఓ ప్రత్యేకమైన ట్రక్కు ద్వారా నోయిడా నుంచి అయోధ్యకు తరలించారు. 

లంకాధిపతి రావణుడు సీతా మహాసాధ్విని అపహరించాక, వాయు మార్గంలో తీసుకెళుతున్నప్పుడు ఆయనను అడ్డుకున్న పక్షి జటాయువు. సీతను రావణుడి నుంచి కాపాడే ప్రయత్నంలో ఈ పురాణ కాల పక్షి రెక్కలు తెగి ప్రాణాలు విడిచింది.

  • Loading...

More Telugu News