Ram Lalla: నేను చెక్కేటప్పుడు రామ్ లల్లా శిల్పం ఒకలా ఉంది... ప్రతిష్ఠాపన తర్వాత ముఖంలో భావాలు మారిపోయాయి: శిల్పి యోగిరాజ్
- అయోధ్యలో జనవరి 22న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
- రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించిన యోగిరాజ్
- ప్రాణ ప్రతిష్ఠ తర్వాత శిల్పం ముఖంలో నవ్వు ప్రత్యక్షమైందని వెల్లడి
- విగ్రహం తాను చెక్కిందేనా అనే సందేహం వచ్చిందన్న శిల్పి
అయోధ్యలో చారిత్రాత్మక రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించిన శిల్పి యోగిరాజ్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. బాలరాముడి విగ్రహం చెక్కేటప్పుడు ఒకలా ఉన్న శిల్పం... ప్రాణ ప్రతిష్ఠాపన తర్వాత మరోలా అనిపించిందని అన్నారు. ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత శిల్పం ముఖంలో చిరునవ్వు, కళ్లలో భావాలు ప్రత్యక్షమయ్యాయని యోగిరాజ్ వివరించారు. ఓ దశలో, ఇది నేను చేసిన విగ్రహమేనా అనే సందేహం కూడా వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, జనవరి 22న అయోధ్య ఆలయంలో బాలక్ రామ్ (రామ్ లల్లా) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన క్రతువు నిర్వహించారు. నవ్వుముఖంతో ఉన్న బాలరాముడి దివ్యస్వరూపాన్ని చూసేందుకు భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు. లెక్కకు మిక్కిలిగా వస్తున్న రామ భక్తులను నియంత్రించడం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యంత ప్రయాసగా మారింది.