YS Jagan: వెంకయ్య నాయుడు, చిరంజీవిలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు
- పద్మవిభూషణ్‌కు ఎంపికైన తెలుగు దిగ్గజాలకు సీఎం ప్రశంస
- పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ఏపీ వ్యక్తి డి.ఉమా మహేశ్వరికి సీఎం జగన్ అభినందనలు
- గురువారం రాత్రి పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపికైన తెలుగు తేజాలు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీరిద్దరినీ ప్రశంసించారు. అదేవిధంగా పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ఏపీకి చెందిన డి.ఉమా మహేశ్వరిని కూడా సీఎం జగన్ అభినందించారు. కళల విభాగంలో హరికథకుగానూ ఆమె పద్మశ్రీ అవార్డుకు ఎంపికవ్వడం ప్రశంసనీయమన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
కాగా సంప్రదాయ అవరోధాలను అధిగమించి సంస్కృతంలో హరికథా ప్రదర్శన చేసిన తొలి మహిళగా ఆమె నిలిచారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా హరికథ కళను సజీవంగా ఉంచారు. వారి రంగాల్లో అవార్డులు పొందిన మిగతా గ్రహీతలకు కూడా సీఎం అభినందనలు తెలిపారు. కాగా ప్రజా వ్యవహారాల కేటగిరిలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కళారంగం కేటగిరిలో మెగాస్టార్ చిరంజీవిలను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ మేరకు పద్మ పురస్కారాలను గురువారం రాత్రి ప్రకటించింది.
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల జాబితా ఇదే..
1. వైజయంతిమాల బాలి (కళలు) - తమిళనాడు
2. కొణిదెల చిరంజీవి (కళలు) - ఆంధ్రప్రదేశ్
3. ఎం. వెంకయ్య నాయుడు (ప్రజా సంబంధాలు) - ఆంధ్రప్రదేశ్
4. బిందేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ) (మరణానంతరం) - బీహార్
5. పద్మాసుబ్రహ్మణ్యం (కళలు) - తమిళనాడు.